వర్ని: వర్ని మండలం జాకోర గ్రామంలో మంగళవారం బారడి పోచమ్మ పండుగను గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతిఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే ఈ పండుగను పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గ్రామ శివారులోని పోచమ్మ ఆలయం వద్ద భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా బారడి పోచమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి భక్తితో పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొర్వ గోదావరి, నాయకులు గణేశ్, కల్లాలి గిరి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.