మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 26, 2020 , 02:06:38

మోదం.. ఖేదం..

మోదం.. ఖేదం..


మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం కలిగించాయి.  జిల్లాలో పుర పోరు ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. చైర్మన్‌ అభ్యర్థులు అనుకున్న వారికి భంగపాటు కలగగా.. మరికొందరికి మరోసారి అందలాన్ని ఎక్కించాయి. విపక్షాల నుంచి పోటీ చేసిన చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు ఘోర పరాభవం మిగిలింది. మూడు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను విచిత్ర ఫలితాలు వచ్చాయి. జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీలుండగా.. శనివారం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా ఫలితాలు రావడం ఆసక్తికరంగా మారింది. పార్టీల పరంగా గతంతో పోల్చితే ప్రస్తుతం కొన్ని మున్సిపాలిటీల్లో బలం పెంచుకోగా.. మరికొన్ని మున్సిపాలిటీల్లో బలాన్ని కోల్పోయాయి.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:  జిల్లాలో ఎక్కువ స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలువగా.. తర్వాత స్థానంలో ఎంఐఎం పార్టీ ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఆశించిన మేర స్థానాలను దక్కించుకోలేదు. 80 వార్డులకుగాను టీఆర్‌ఎస్‌ 35 వార్డుల్లో విజయం సాధించింది. నిర్మల్‌లో 2014 ఎన్నికల్లో మూడు వార్డుల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఏకంగా 30వార్డులను దక్కించుకోవడం విశేషం. భైంసాలో గతంలో రెండు వార్డులుండగా.. ఈసారి ఒక్క వార్డు గెలవలేదు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాలను దక్కించుకుంది. జిల్లాలో ఎంఐఎం పార్టీ గతంలో 22వార్డులను దక్కించుకోగా.. ప్రస్తుతం ఐదు వార్డులు తగ్గి 17వార్డులకే పరిమితమైంది. గతంలో భైంసాలో 12వార్డులు గెలుచుకుని మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకోగా.. ప్రస్తుతం మరో మూడు స్థానాలు పెరిగి 15 స్థానాలకు చేరుకుంది. దీంతో మరోసారి పుర పీఠాన్ని తన ఖాతాల్లో వేసుకుంటోంది. నిర్మల్‌లో గతంలో 10వార్డులు గెలుచుకోగా.. ఈ సారి కేవలం రెండు వార్డులకే పరిమితమైంది. గతంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి తీసుకోగా.. ఈ సారి రెండు సీట్లతో సరిపెట్టుకుంది.

కాంగ్రెస్‌కు వార్డులు పెరిగినా పదవులు కరవు...

జిల్లాలో గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఏడు వార్డులు గెలుచుకోగా.. ప్రస్తుతం 12వార్డులను గెలుచుకుంది. నిర్మల్‌లో గతంలో ఐదు వార్డులుండగా.. ప్రస్తుతం ఏడు వార్డులను దక్కించుకుంది. భైంసాలో గతంలో రెండు వార్డులు కాంగ్రెస్‌ ఖాతాలో ఉండగా.. ఈసారి అసలు బోణీ చేయలేదు. ఖానాపూర్‌లో ప్రస్తుతం ఐదు వార్డులను దక్కించుకుంది. జిల్లాలో గతంలో బీజేపీ ఒక్క భైంసాలో మాత్రమే ఆరు వార్డులను గెలువగా.. నిర్మల్‌లో బోణీ చేయలేదు. తాజాగా భైంసాలో 9వార్డులు గెలువగా.. నిర్మల్‌, ఖానాపూర్‌లో ఒక్కో స్థానంలో గెలిచి బోణీ చేసింది. నిర్మల్‌, ఖానాపూర్‌లో ఎంఐఎం, బీజేపీ పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. నిర్మల్‌లో కాంగ్రెస్‌ ఏడు స్థానాలతో సరిపెట్టుకోగా.. ఖానాపూర్‌లో కాస్తా నయమనిపించింది. భైంసాలో అసలే బోణీ చేయకపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది.

అప్పాలకు అడుగడుగునా ఆశాభంగం...

అప్పాల గణేశ్‌ అనుచరులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోగా.. కొందరు కాంగ్రెస్‌లో మరికొందరు బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన వారిలో ఒక్కరూ తప్ప మిగతా వారంతా ఓటమి చవిచూశారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి ఈసారి ఎన్నికల బరిలో లేకపోగా.. ఆయన సొంత వార్డులో తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. తమ బంధువు అయిన అప్పాల మంజుల ఈ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నేరేళ్ల వేణుగోపాల్‌ చేతిలో 27ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక గతంలో మున్సిపల్‌ చైర్మన్‌గా అప్పాల గణేశ్‌తో పాటు ఆయన కుటుంబీకులు పలుమార్లు మున్సిపల్‌ చైర్మన్‌లుగా పని చేయగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో వారి బంధువులు, సన్నిహితులు ఓటమి చవిచూశారు. ఒకరకంగా చెప్పాలంటే నిర్మల్‌ మున్సిపాలిటీపై పూర్తి పట్టు కోల్పోయారని చెప్పవచ్చు.

మరోసారి పురపీఠంపై గండ్రత్‌ ఈశ్వర్‌, సబియాబేగం

నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో తొలిసారిగా రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌ ఎన్నికవుతున్నారు. 2000-2005వరకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేసిన గండ్రత్‌ ఈశ్వర్‌ ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాగా.. తాజాగా ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ లభించింది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌గా కావడం నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. భైంసాలో ఎంఐఎం నుంచి సబియాబేగం రెండోసారి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానున్నారు. 2వవార్డు నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించగా.. తాజాగా ఎంఐఎం 15స్థానాలు గెలువడంతో ఆమె మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానున్నారు. ఎంఐఎం నాలుగోసారి భైంసా పుర పీఠాన్ని దక్కించుకుంది.


logo
>>>>>>