బ్యాంకు పరీక్షలు రాసేవారికి మరో శుభవార్త. IBPS నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం1828 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ పోస్టులకు నవంబర్ 23లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, ప్రిపరేషన్ విధానం గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులను 6 కేటగిరీల్లో నియమించనున్నారు. డిగ్రీ అర్హతతో పాటు ఆయా కేటగిరీల్లో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. IBPS ద్వారా ఈ ఏడాది చేపట్టే చివరి బ్యాంకు పరీక్ష ఇది. ఇదివరకే IBPS క్లర్క్, పీవో పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ అభ్యర్థుల్లో ఎస్వో పరీక్ష కోసం ప్రిపేరయ్యేవారు అరుదు. ఇందుకు కారణం పోస్టులవారీగా ప్రత్యేక విద్యార్హతలు కలిగి ఉండటం. కాబట్టి IBPS ఎస్వోకు తక్కువ కాంపిటేషన్ ఉంటుందని చెప్పవచ్చు. సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగి ఉండి, బ్యాంకింగ్‌లో సిలబస్‌పై పట్టు ఉన్నవారికి ఈ ఎస్వో నోటిఫికేషన్ మంచి అవకాశం.
విద్యార్హతలు, సిలబస్, విధివిధానాలు
ఐటీ ఆఫీసర్స్
బీటెక్- ఐటీ/ఈసీఈ లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ లేదా ‘బి’ లెవల్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
సిలబస్: సబ్జెక్టు నైపుణ్యంపై ప్రశ్నలు ఉంటాయి. బ్యాంకింగ్ కాని ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సిలబస్ అంటూ ఉండదు. గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్ రూపొందిస్తారు. ఇందులో ముఖ్యమైన అంశాలు కరెంట్ అఫైర్స్, డాటా వంటివి కీలకం.
ఐటీ ఆఫీసర్స్‌కు దరఖాస్తు చేసేవారు మెయిన్స్ కోసం కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డాటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డాటా- కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ అండ్ మైక్రోప్రాసెసర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఇన్ ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటిపై కూడా ఫోకస్ చేయాలి.
విధి విధానాలు
IBPS ద్వారా నియమితులయ్యే బ్యాంక్ స్పెషల్ ఆఫీసర్లు బ్యాంకింగ్‌లో ఐటీ డాటా ప్రాసెసర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానాలు, మొబైల్ యాప్‌ల నిర్వహణ, రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీల విశ్లేషణ చేస్తారు.
మెయిన్స్‌లో 60 మార్కులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను చదివితే మెయిన్స్‌పై అవగాహన కలుగుతుంది.
అగ్రికల్చర్ ఆఫీసర్స్
అత్యధిక పోస్టులు కలిగిన కేటగిరీ ఇది. ఇందులో 884 AFO పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: బీటెక్ ఇన్ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ సీఎస్ఈ.
సిలబస్: కచ్చితమైన సిలబస్ లేకపోవడంతో గత ప్రశ్నపత్రాల ఆధారంగా లేదా AFO/ADO ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసే నాబార్డు నేషనల్ సీడ్ కార్పొరేషన్, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వివిధ ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అంచనా వేయవచ్చు.
దీనిలో జనరల్ సైన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ప్లాంట్ పాథాలజీ, ఎకాలజీ, సీడ్ సైన్స్, అగ్రానమీ అండ్ ఇరిగేషన్, బేసిక్స్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్స్, ఆగ్రోఫారెస్ట్రీ వంటి ముఖ్యమైన టాపిక్స్‌పై ఫోకస్ పెట్టాలి.
విధివిధానాలు
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లు బ్యాంకింగ్ రంగంలో కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా గ్రామీణ, వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వ్యవసాయ రుణాలు కల్పించడం, గ్రామీణులకు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం ప్రభుత్వానికి, వ్యవసాయదారులకు మధ్య ఆర్థిక రుణసౌకర్యాలు కల్పించడం వంటి విధానాలు అవలంబిస్తుంటారు.
మంచి మార్కులు సాధించడం ఎలా: వ్యవసాయ రంగంలో నైపుణ్యం, కోర్ సబ్జెక్టు నాలెడ్జ్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా జోడించి చదవడం మంచిది. ముఖ్యంగా యోజన, కురుక్షేత్ర వంటి మాసపత్రికలు తప్పకుండా చదవాలి.
రాజభాష అధికారులు
అర్హతలు: హిందీ లేదా సంస్కృతంలో డిగ్రీ కలిగి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా కలిగి ఉండటం తప్పనిసరి.
సిలబస్: డిగ్రీ/పీజీ వంటి అకడమిక్ సిలబస్ సరిపోతుంది.
పరీక్ష: మెయిన్స్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెక్షన్లో రెండు విధాల ప్రశ్నలు ఉంటాయి.
లా ఆఫీసర్లు
అర్హతలు: 3 లేదా 5 సంవత్సరాల LLB డిగ్రీ కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా నమోదై ఉండాలి.
సిలబస్: బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ‘లా’ అవశ్యకత, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, కైంప్లెంట్స్ అండ్ లీగల్ యాస్పెక్ట్స్, రిలవెంట్ లా అండ్ ఆర్డర్స్ రిలేటెడ్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, సెక్యూరిటీస్ అండ్ ఫారెన్ ఎక్సేంజ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ లిమిటెడ్ యాక్ట్, బ్యాంకింగ్ యాక్ట్స్, బ్యాంకింగ్ వినియోగదారుల హక్కు చట్టం వంటి అంశాలు ముఖ్యమైనవి.
విధి విధానాలు
లా ఆఫీసర్లు బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వంటి విధివిధానాలను నిర్వహిస్తారు. బ్యాంకు లోన్లు ఎగవేత, వేలం వేయడం, బ్యాంకు ద్వారా ఎగవేతదారులకు నోటీసులు జారీచేయడం, బ్యాంకింగ్ అగ్రిమెంట్లు వంటివి నిర్వహిస్తారు.
HR లేదా పర్సనల్ ఆఫీసర్లు
అర్హతలు: MBA-HR స్పెషలైజేషన్‌తో రెండు సంవత్సరాల పీజీ, డిగ్రీ కలిగి ఉండాలి.
సిలబస్: HR/ సోషల్ వర్క్/ లేబర్ లాస్ వంటి టాపిక్స్‌పై పట్టు సాధించాలి. ఇందులో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్-ఇంట్రడక్షన్, స్టాఫింగ్, మ్యాన్‌పవర్ ప్లానింగ్, పర్ఫామెన్స్ అప్రైజల్స్, వేజ్ అండ్ శాలరీ మేనేజ్మెంట్, ఎంప్లాయ్ కోచింగ్ అండ్ ట్రైనింగ్, కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, HR ఆడిట్, స్కోర్ కార్డు వంటి అంశాలు కీలకం.
విధివిధానాలు: ఉద్యోగుల పనితీరు, బదిలీలు వారి జీతభత్యాలు మానవ వనరుల అభివృద్ధి వంటి విధివిధానాలు ఉంటాయి.
మంచి మార్కులు కోసం HR ఆఫీసర్స్ విధివిధానాలపై మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
మార్కెటింగ్ ఆఫీసర్లు
అర్హతలు: ఎంబీఏ మార్కెంటింగ్, పీజీ కలిగి ఉండాలి.
సిలబస్: బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, బ్రాండ్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్, సేల్స్, రిటైల్ రంగం, బిజినెస్ ఎథిక్స్, మార్కెటింగ్ సెగ్మెంట్, మార్కెట్ రిసెర్చ్ అండ్ డిమాండ్ ఫోర్కాస్ట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ వంటివి ముఖ్యమైన అంశాలు.
విధివిధానాలు: బ్యాంకింగ్ వ్యవస్థను రూపుదిద్దడం, కార్యకలాపాలను వినియోగదారుని వరకు చేరవేయడంలో మార్కెటింగ్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు.
పరీక్ష స్వరూపం
మూడంచెల పరీక్ష. ఇందులో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ఉంటుంది. క్లర్క్, పీవో పరీక్షల కంటే ఈ పరీక్ష కాస్త భిన్నమైనది. పరీక్ష లెవల్ కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇతర బ్యాంకు పరీక్షల కంటే పోటీ కూడా తక్కువగా ఉంటుంది. కేటగిరీలవారీగా ప్రత్యేక డిగ్రీ ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హత కావడం వల్ల ఈ పరీక్ష కచ్చితత్వం ఉన్నవారు మాత్రమే రాస్తుంటారు.
ప్రిలిమినరీ: ఇది రెండు విధాలుగా ఉంటుంది. లా ఆఫీసర్ రాజభాష అధికారికి ఒకవిధంగా ఇతర కేటగిరీలవారికి మరో విధంగా ఉంటుంది.
మెయిన్స్: ఇందులో సాధించిన మార్కులను బట్టి ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్స్+ ఇంటర్వ్యూ మార్కుల (80:20) తుది జాబితా తయారుచేస్తారు.
లా-ఆఫీసర్/ఐటీ/హెచ్ఆర్ / మార్కెటింగ్ అగ్రికల్చర్
సబ్జెక్ట్ నాలెడ్జ్: 60 ప్రశ్నలు- 60 మార్కులు-45 నిమిషాలు
నెగెటివ్ మార్కింగ్- 0.25
రాజభాష అధికారి: సబ్జెక్ట్ నాలెడ్జ్
ఆబ్జెక్టివ్ ప్రశ్నలు- 45 ప్రశ్నలు
రాత పరీక్ష – 2 ప్రశ్నలు
మొత్తం 60 మార్కులు, 60 నిమిషాలు
ఇంటర్వ్యూ: 100 మార్కులకు ఉంటుంది. ఇందులో కనిష్టంగా 40% మార్కులు సాధించాలి.
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్
ఇంగ్లిష్ లాంగ్వేజ్: అన్ని కేటగిరీల వారికి కామన్ విభాగం ఇది. ప్రిలిమినరీలో 50 ప్రశ్నలు, రాజభాషలో రాత పరీక్ష ఉంటుంది.
ఆబ్జెక్టివ్ విధానం కోసం
రీడింగ్ కాంప్రహెన్షన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇడియం-ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, క్లోజ్డ్ టెస్ట్, పేరాజంబుల్డ్, ఎర్రర్ రెక్టిఫికేషన్స్ వంటివి ముఖ్యమైన టాపిక్స్.
గత ప్రశ్నపత్రాలను తిరిగేయడం, మోడల్ ప్రశ్న పత్రాలను రివైజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
రీజనింగ్: ప్రిలిమ్స్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. IBPS లెవల్ టాపిక్స్ కామన్‌గా ఇందులో వస్తుంటాయి. రీజనింగ్ నుంచి కోడింగ్-డికోడింగ్, సిలాజిసమ్స్, కోడెడ్-ఇన్‌ఈక్వాలిటీస్, బ్లడ్‌రిలేషన్స్, పజిల్ టెస్ట్, సీటింగ్ అరెంజ్మెంట్, డైరెక్షన్స్, ర్యాంకింగ్స్, ఇన్, అవుట్ పుట్స్ వంటి వాటితో పాటు స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు కూడా చదవాలి.
అర్థమెటిక్/ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్: ఇందులో నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డాటా అనాలిసిస్, డాటా ఇంటర్‌ప్రిటేషన్స్, పర్సంటేజీ, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ వంటి టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
నిత్యం అర్థమెటిక్, రీజనింగ్ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఉత్తీర్ణత మార్కులు సాధించే అవకాశం ఉంది.
జనరల్ అవేర్నెస్: బ్యాకింగ్ అవేర్నెస్, ఆర్థిక అంశాలు కలిపి చదవాలి. ఇందులో జనరల్ నాలెడ్జ్ టాపిక్స్‌తో బ్యాకింగ్ వ్యవహారాలు, ఆర్బీఐ వడ్డీ రేట్లు, మానిటరి పాలసీ, రివ్య్యూలు, ద్రవ్యోల్బణం, పేదరిక నిర్మూలన-కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు, సదస్సులు, ముఖ్యమైన రోజులు, పుస్తకాలు, రచయితలు, అవార్డులు, కేంద్ర బడ్జెట్ తో పాటు క్రీడాంశాలు కూడా చదవాలి.
మొత్తం పోస్టలు: 1828 (పోస్టుల సంఖ్య మూడింతలయ్యే అవకాశం ఉంది)
చివరితేదీ: నవంబర్ 23
వయస్సు: 20-30
ఫీజు: రూ.175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ), ఇతరులకు రూ.850.
S Madhukiran
Focus Academy Hyderabad
9030496929