మహిళల్లో గుండెపోట్లు తక్కువ అని మొన్నటి వరకు అనుకునేవాళ్లం. కానీ, మహిళల్లోని ఎక్స్ క్రోమోజోమ్స్ వల్ల గుండెపోట్లు వచ్చే అవకాశం పురుషులకన్నా వారిలోనే ఎక్కువని అంటున్నారు పరిశోధకులు. ఆడవాళ్లలో xx క్రోమోజోమ్స్ ఉండటం వల్ల రక్తంలో కొవ్వుల రవాణా ఎక్కువగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కెన్టుకీ పరిశోధకులు నిర్ధారించారు. దీంతో వీరిలో రక్తనాళాలు సులువుగా కుంచించుకుపోయి గుండెపోట్ల రిస్కు పెరుగుతుందని చెబుతున్నారు. xx క్రోమోజోమ్స్ కొవ్వుల శోషణ పెరగడానికి కారణమవుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. మహిళల్లో సంభవిస్తున్న మరణాలకు ముఖ్యమైన కారణాల్లో కరొనరీ ఆర్టరీ వ్యాధులు కూడా ఒకటి అవుతున్నాయి. అయితే, పురుషులకన్నా మహిళల్లో 10 ఏండ్ల తరువాత గుండెపోట్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మెనోపాజ్‌కు ముందు లైంగిక హార్మోన్లయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లు గుండెకు రక్షణనిస్తాయి. మెనోపాజ్ మొదలయ్యాక లైంగిక హార్మోన్లు తగ్గిపోయి రిస్కు పెరుగుతుంది. దీన్ని xx థ్రిఫ్టీగా చెబుతున్నారు పరిశోధకులు. అథెరోస్ల్కిరోసిస్ పైన ఈ జన్యువుల ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఏదేమైనా మెనోపాజ్ తరువాత మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకోకపోవడం, మంచి ఆహారం తీసుకోవడం పట్ల జాగ్రత్తపడాలి.