Immunotherapy | ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడితే మరణం ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుగుణంగా క్యాన్సర్ నివారణకు చికిత్సలు కనుగొనబడ్డాయి. వీటిలో అత్యంత సాధారణంగా కీమోథెరపీ, రేడియేషన్ మాత్రమే కొనసాగిస్తున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ఇమ్యునోథెరపీ కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఊరటగా నిలుస్తోందని సికింద్రాబాద్‌లోని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ అంటున్నారు. మరి ఈ చికిత్స ఎలా చేస్తారు? మిగిలిన చికిత్సలతో పోలిస్తే ఈ విధానం ఎందుకు బెటర్ అనేది ఆయన వివరించారు.
క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఈ అసాధారణ కణాలు తరచుగా మారుతూ పరివర్తన చెందుతాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. అయితే ఇమ్యునోథెరపీ క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు శరీరంలో సొంతంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది క్యాన్సర్ థెరపీల విస్తృత వర్గం. ఈ ఇమ్యునోథెరపీ.. పెరుగుతున్న క్యాన్సర్ కణాల గురించి రోగ నిరోధక వ్యవస్థను హెచ్చరించడానికి రూపొందించబడ్డాయి. కాబట్టి దీనికి సంబంధించిన మందులు క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తాయి.
క్యాన్సర్ కణతి కణాలపై దాడి చేసేందుకు ఇమ్యునోథెరపీ శరీరంలో వివిధ పద్ధతులను ఎంచుకుంటుంది. ట్యూమర్ వ్యాక్సిన్లు, సెల్యూలర్ ఇమ్యునో థెరప్యూటిక్ ఏజెంట్లు, T కణాలను లక్ష్యంగా చేసుకునే ఇమ్యునోమాడ్యులేటరీ మందులు, ఆంకోలైటిక్ వైరోథెరపీ, ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్లు (ICIలు) వంటి అనేక రకాల ఇమ్యునో థెరప్యూటిక్ మందుల వినియోగం ఇటీవల ఎక్కువైంది. ఇవన్నీ ఒకటి నుంచి నాలుగో దశ ఉన్న క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు వైద్య నిపుణులు. వీటన్నింటిలో, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ 1 (PD-1) / PD లిగాండ్ 1 (PD-L1) ఇన్హిబిటర్లచే సూచించబడే ICI థెరపీ, మెలనోమా, లంగ్, వంటి పలు రకాల చికిత్సలు ప్రోస్టేట్, బ్రెస్ట్, గ్యాస్ట్రిక్ మొదలైన క్యాన్సర్ ట్రీట్మెంట్లో పురోగతి సాధిస్తున్నాయి.
ఇమ్యునోథెరపీ చికిత్సను సింగిల్‌గా ఉపయోగించవచ్చు. లేదా సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి ఇతర క్యాన్సర్ చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చు. ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ రెండూ సాధారణంగా క్యాన్సర్ చికిత్సలు. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేందుకు ఉపయోగిస్తారు. అయినా.. కీమోథెరపీ మందులు శరీరం అంతటా వేగంగా ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేయడానికి ఉపయోగించబడుతున్నప్పటికీ.. ఇమ్యునోథెరపీ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేసే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రేరేపిస్తుంది.
ఇమ్యునోథెరపీలు పలు రకాలు ఉన్నాయి. క్యాన్సర్ రోగికి వైద్యుల బృందం వీటిలో ఏ చికిత్సలను సిఫార్సు చేస్తుంది అనేది క్యాన్సర్ రకం, దాని దశపై ఆధారపడి ఉంటుంది. ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్లు.. క్యాన్సర్ రోగిలో దెబ్బతింటున్న రోగనిరోధక వ్యవస్థను మేల్కొలిపే మందులు. వీటిలో చాలా మందులు క్యాన్సర్ చికిత్సకు అనుకూలమని ఆమోదించబడ్డాయి. ఇవి రోగనిరోధక కణాల ఉపరితలంపై PD-1, PD-L1, CTLA-4 తో పాటు TF ప్రొటీన్లను అడ్డుకుంటాయి. తర్వాత క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటకు వెళ్లేలా చేస్తాయి. ప్రస్తుత చెక్‌పాయింట్ ఇన్హిబిటర్ మందులు ప్రధానంగా రెండు గ్రాహకాలను లక్ష్యంగా చేసుకుంటాయి. PD-1 CTLA-4 గ్రాహకాలను టార్గెట్ చేసుకుంటాయి.
క్యాన్సర్‌కు ఎన్నో రకాల చికిత్సలు ఉన్నాయి. వీటిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి.అయినప్పటికీ మిగిలిన చికిత్సల కంటే కూడా ఇవి తక్కువ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చికిత్సలో క్యాన్సర్ కణతిపై దాడి చేసేందుకు శరీరంలోకి రసాయనాలను ప్రవేశపెట్టడానికి బదులుగా శరీరంలోని శక్తినే ఉపయోగించుకుంటాయి. క్యాన్సర్‌లో ప్రతి చికిత్సకు వేర్వేరు దుష్ప్రభావాలు ఉంటాయి. రోగులు కూడా అదే చికిత్సకు భిన్నంగా స్పందించవచ్చు. క్యాన్సర్ రోగికి ఇచ్చిన ఇమ్యునోథెరపీ రకం, క్యాన్సర్ రకం, దశ, రోగి సాధారణ ఆరోగ్యం, చికిత్స నియమావళిని బట్టి ప్రమాదాలు మారుతూ ఉంటాయి. చికిత్సను బట్టి క్యాన్సర్ రోగిలో జ్వరం, చలి, బలహీనత, మైకం, వికారం, కండరాల నొప్పులు, అలసట లేదా తలనొప్పి వంటి ఫ్లూ-వంటి లక్షణాలు కనిపించవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలు ఇమ్యునో థెరప్యూటిక్ మందులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ప్రభావం, వినియోగం వేరియబుల్ కాబట్టి నిపుణుల సలహాలు, సంప్రదింపుల ద్వారా దీని వినియోగంపై నిర్ణయం తీసుకోవాలి.