గౌతమ్ : బిజినెస్ స్కూల్ పరిచయం మాది. మళ్లీ పన్నెండేండ్ల తర్వాత ముంబైలో జరిగిన ఓ సంగీత్‌లో తనను కలిశాను. అప్పటికే నేను బిజినెస్‌లో ఉన్నాను. క్షణం కూడా తీరిక దొరికేది కాదు. సినిమాలు చాలా తక్కువగా చూసేవాడిని. తనతో మాట్లాడినప్పుడే తెలిసింది, కాజల్ సినిమా నటి అని. అప్పటివరకూ నాకు ఆ విషయమే తెలియదు. క్రమంగా మా స్నేహం ప్రేమగా మారింది. దోస్తులుగా ఎన్నో విషయాలు పంచుకునేవాళ్లం. పెండ్లితో మా బంధం మరింత బలపడింది.
కాజల్ : గౌతమ్ జీవితంలోకి వచ్చాక నా లోకమే మారిపోయింది. వివాహంతో మా ప్రేమ బంధం మరింత బలపడింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం.స్నేహితులు ప్రేమికులైతే స్నేహం కనుమరుగు అవుతుందని అంటారు. ప్రేమికులు ఆలూమగలు అయితే మునుపటి ఆకర్షణ సన్నగిల్లుతుందని చెబుతారు. కాజల్, గౌతమ్ కిచ్లూ దంపతులను చూస్తే.. ఆ మాట అబద్ధమని అర్థమైపోతుంది. ప్రేమికులు స్నేహితుల్లా ఉండవచ్చు. ఆలూమగలు ప్రేమికుల్లా మెలగవచ్చు. ఆ ఇద్దరి బంధానికి చిట్టిపొట్టి సాక్షి సంతకం.. కాజల్ పొట్టలోని బుజ్జాయి! ఓ ఇంటర్వ్యూలో ఆ దంపతులు కట్టుకుంటున్న గూడు గురించి, పుట్టబోయే పాపాయి గురించి పరవశంగా చెప్పారు. వాలెంటైన్స్‌డే
(ఫిబ్రవరి 14) సందర్భంగా ఆ సంభాషణ..
గౌతమ్ : కరోనా కారణంగా మేం నిరాడంబరంగా పెండ్లి చేసుకోవలసి వచ్చింది. రెండు కుటుంబాల పెద్దలు, స్నేహితులనే ఆహ్వానించాం. హనీమూన్‌కు మాల్దీవుల వరకు మాత్రమే వెళ్లగలిగాం. ఇప్పుడు మా కలల సౌధాన్ని కట్టుకుంటున్నాం. త్వరలోనే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇంతలోనే కాజల్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
కాజల్ : (నవ్వుతూ) నిజమే. ఏ మహిళకైనా మాతృత్వం ఓ వరం. అందుకే ఆ శుభ
వార్తను నా అనుకున్నవారితో, అభిమానులతో పంచుకున్నా. మా రెండు కుటుంబాలూ చాలా సంతోషంగా ఉన్నాయి. చిన్నారి కోసం ఎదురుచూస్తున్నాయి.
గౌతమ్ : మా ప్రేమ బంధంలో స్నేహం కూడా ఉంది. చిన్నచిన్న సంతోషాలే మాకు పెద్ద
ఆనందాన్ని ఇస్తాయి. కాజల్ విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన చిత్రాలను నాతో పంచుకుంటుంది. ఆ ఫొటోలతో నా గ్యాలరీ నిండిపోయింది.
కాజల్ : గౌతమ్ నైస్ పర్సన్. మృదు స్వభావి. నా మనసు తెలిసిన వ్యక్తి. సెన్సాఫ్
హ్యూమర్‌తో మమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతాడు. తన వ్యాపారాలతో పాటు నా వ్యాపారాలను కూడా చూసుకుంటున్నాడు. నాకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతున్నాడు. ఆ పొదుపు పాఠాలు ఎంత విన్నా విసుగు తెప్పించవు. కొత్తింటి పనులు కూడా తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు.
గౌతమ్ : సొంతింటి విషయంలో మొదట్లో మా ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉండేవి. కూర్చుని మాట్లాడుకున్నాక ఓ స్పష్టత వచ్చింది. మా ఇద్దరి అభిరుచుల మేరకు కొత్తింటిని నిర్మిస్తున్నాం. హంగులూ ఆర్భాటాలతో ఇల్లు హోటల్ గదిలా ఉంటే మాత్రం ఊరుకోనని కాజల్ హెచ్చరించింది (నవ్వుతూ). తన కోసం వర్లీ శైలిలో
నిర్మాణం చేపట్టాం. ఇంటి విషయంలో తుది నిర్ణయం కాజల్‌దే.
కాజల్ : నాకు అన్నిరకాలుగా మద్దతు తెలిపే అత్తామామలు ఉన్నారు. అందుకే ఇంత హాయిగా ఉండగలుగుతున్నా. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పొట్టలోని బిడ్డ కోసం సినిమాలకు విరామం ఇచ్చాను. పాపనో, బాబునో బడిలో చేర్పించాకే మళ్లీ సినిమాల గురించి ఆలోచిస్తా. సినిమాలే నా ఫస్ట్‌లవ్ అయినా.. ఇది తప్పని పరిస్థితి. ఎందుకంటే, నా స్నేహితుల పిల్లలు ఎలా ఎదుగుతున్నారో దగ్గరినుంచి చూశాను. అందుకే నటనకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇటీవల నా చెల్లికి కూతురు పుట్టింది. నా కాన్పు తర్వాత, మా ఇద్దరి పిల్లలూ కలిసే ఆడుకుంటారు. ఇందుకోసం గౌతమ్ ప్రత్యేకమైన నర్సరీ ఏర్పాటు చేస్తున్నాడు.
గౌతమ్ : ఇద్దరం ఒకరిపట్ల ఒకరు బాధ్యతతో వ్యవహరిస్తాం. అభిప్రాయాలు పంచుకుంటాం. ఎందుకంటే మా ప్రేమకు పునాది స్నేహమే. ఆ మూలాలు బలంగా ఉండాలి. అన్నట్టు, ఇంట్లో కాలక్షేపానికి ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నాం.
కాజల్ : గౌతమ్ నా సంరక్షకుడు. నేను ఎంచుకున్న దశలోనే నన్ను నడిపిస్తున్నాడు. తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మమ్మల్ని కలిపిన కాలానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది చాలా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న దక్షిణాది ప్రేక్షకులకు రుణపడి ఉంటా.