బెర్లిన్, మే 15: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి వైఫల్యం దిశగా సాగుతున్నదని, ఈ యుద్ధంలో ఉక్రెయినే విజయం సాధించే అవకాశం ఉన్నదని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. నాటో కూటమిలో చేరికపై ఫిన్లాండ్, స్వీడన్ అనుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చర్చించేందుకు నాటో సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు.
రష్యా ప్రణాళికలు వేసుకున్నట్టు యుద్ధం సాగడం లేదని, కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యారని, ఖార్కీవ్ నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. అవసరమైనంత వరకు ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం అందించేందుకు తమ కూటమి దేశాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు తీవ్ర అస్వస్థతతో ఉన్నారని, ఈ మేరకు రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయని బ్రిటన్ మాజీ గూఢచారి క్రిష్టోఫర్ స్టీలే స్కైన్యూస్‌తో అన్నారు. స్వేచ్ఛా ప్రపంచానికి రష్యా ఓ ముప్పుగా మారిందని పోలాండ్‌కి చెందిన నోబెల్ గ్రహీత రచయిత ఓల్గా తోకార్క్జుక్ ఆందోళన వ్యక్తం చేశారు.