కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రయోజనాలను సూచించే ‘బాకీ కార్డులకు’ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ హామీలను అమలు చేస్తామని చెప్పిందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో అనేక హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల ద్వారా ఎంత మేర బాకీ పడిందో ప్రజలకు తెలియజేస్తూ, ఇచ్చిన హామీలను ఇకనైనా నెరవేర్చాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ‘బాకీ కార్డుల పూజ’ కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల ముందుంచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కవితను కేసీఆర్‌ను కలపడానికి ప్రయత్నం చేసిన, విడగొట్టడానికి ప్రయత్నం చేసిన విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. పార్టీ లైన్ దాటిన తర్వాత కేసీఆర్ కవితను పార్టీ నుంచి వేటు వేశారు’’ అని అన్నారు.
‘‘నేను, మా తండ్రి వేముల సురేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం. 2001 తెలంగాణ ఆవిర్భావానికి ముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. టీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి అంటేనే టీఆర్ఎస్ పార్టీ. కవిత మధ్యలో వచ్చిండ్రు.. మధ్యలో పోయిండ్రు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ పార్టీతో నేను మంతనాలు చేశానని అంటున్న కవిత.. ఇప్పుడు కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది నేనా.. కవితనా? అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది నేనా.. కవితనా?’’ అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
‘‘లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ఉన్న నేను కాంగ్రెస్‌లోని ఎవరితో మంతనాలు చేయలేదు. కవిత కాంగ్రెస్‌తో మంతనాలు చేయలేదని చెప్పగలరా? కవిత రహస్యంగా కాంగ్రెస్ నాయకులతో మంతనాలు చేయలేదని చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు.
‘‘నిరాధారమైన ఆరోపణలు ఎవరి లాభం కోసం కవిత చేస్తున్నారు? స్వలాభం కోసం వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసే హక్కు కవితకు లేదు’’ అని అన్నారు.
‘‘మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వారిని కవిత టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న వారిని కవిత టార్గెట్ చేస్తుంది. ప్రత్యక్షంగా మా నాయకత్వాన్ని బలహీనపరిచి, పరోక్షంగా అధికార పార్టీకి కవిత న్యాయం చేస్తుంది’’ అని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడంపై స్పందిస్తూ.. ‘‘రాజకీయంగా సింపతిని గెయిన్ చేయడానికి అని అర్థం అవుతుంది. అది ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం. కవిత చేసే ఈ పనుల వల్ల కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో బిడ్డగా ఆమె ఆలోచించడం లేదు’’ అని అన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయనపైన, కేటీఆర్‌పైన విమర్శలు చేయగా లేనిది మాపై చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ బాధగా అనిపించింది. సొంత లాభం కోసం కవిత మాట్లాడటం పెద్ద బాధగా అనిపించలేదు’’ అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
‘‘కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో నా పాత్ర ఏందో కేసీఆర్‌కు బాగా తెలుసు. కవితపై మొన్నటి వరకు కేసీఆర్ బిడ్డగా గౌరవం ఉండేది. నిన్నటి మాటలతో ఆ గౌరవాన్ని కవిత పోగొట్టుకుంది’’ అని వ్యాఖ్యానించారు.