ప్రకృతి మనకు ప్రసాదించే ప్రతి పదార్థమూ అమూల్యమైందే, సకల పోషకాల సమాహారమే. కానీ, మితిమీరిన ఆధునికత కారణంగా ప్రాసెసింగ్‌లో ఆ విలువలు కనుమరుగు అవుతున్నాయి. అంతెందుకు, ఇంటిని శుభ్రం చేసేందుకు మార్కెట్లో దొరుకుతున్న రసాయనాల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో ‘వేద బయోప్రొడక్ట్స్’ పేరుతో గానుగ నూనె, ఎకోఫ్రెండ్లీ కెమికల్స్ తయారీకి శ్రీకారం చుట్టారు హైదరాబాద్‌కు చెందిన అనితారెడ్డి.
తన స్నేహితులు శాలిని, అనితతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. వేపాకు, బత్తాయి, నిమ్మ తొక్కలు, కుంకుడుకాయ ముడిసరుకుగా ఫ్లోర్, వాషింగ్ మెషీన్ క్లీనింగ్ లిక్విడ్లను తయారు చేయిస్తారు అనిత. పల్లీ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, కొబ్బరి.. ఇలా ఎనిమిది రకాల వంటనూనెలనూ విక్రయిస్తారు. తమ సంస్థలో పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నామనీ తెలిపారు. యాభై ఏండ్ల అనితారెడ్డి తన నర్సరీలో ఔషధ మొక్కలనూ పెంచుతున్నారు.