న్యూఢిల్లీ : భారత క్రికెట్ సంచలనం, ఐపీఎల్లో తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని డబుల్ సెంచరీ మైలురాయిని అందుకోవడమే తన టార్గెట్ అని ఈ బీహార్ కుర్రాడు ప్రకటించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ లెజెండ్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న 175 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొడతానని ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది స్విచ్’ తాజా ఎపిసోడ్లో వైభవ్ తన లక్ష్యాలను వెల్లడించాడు. ‘నాకు టీ20ల్లో 200 పరుగులు సాధించాలని ఉంది’ అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీనిపై పీటర్సన్ స్పందిస్తూ.. ‘టీ20ల్లో క్రిస్ గేల్ పేరిట 175 పరుగుల అత్యధిక రికార్డు ఉంది’ అని గుర్తు చేయగా.. వైభవ్ ఏమాత్రం తడబడకుండా ‘అవును, నేను ఆ రికార్డును బద్దలు కొట్టి 200 పరుగులు చేయాలనుకుంటున్నాను. ఏదైనా ఒక మ్యాచ్‌లో నేను గనుక పూర్తి 20 ఓవర్లు క్రీజులో ఉంటే.. ఖచ్చితంగా ఆ రికార్డును బద్దలు కొడతాను’ అని చెప్పాడు.ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో వైభవ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 144 పరుగులుగా ఉంది.