హైదరాబాద్ : వైట్ నంబర్‌ప్లేట్ వాహనాలను వాణిజ్యం, రవాణా కోసం వినియోగించడం చట్టవిరుద్ధమని, ఈ విషయం మోటారు వాహన చట్టంలో ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. సెక్షన్ 66 ఎంవీ చట్టం ప్రకారం రవాణా వాహనాలకు అనుమతి తప్పనిసరని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారని చెప్పారు.
డ్రైవర్, వాహన యజమానుదారుల వివరాలు సరిగా లేకపోవడంతో 20 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వైట్‌ప్లేట్ ట్యాక్సీల్లో ప్రయాణించే వ్యక్తులకు ఏదైనా జరిగితే బీమా పథకాలు వర్తించవన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సులతోనే సాధ్యమని, ఈ మేరకు ప్రతి ఒక్కరినీ కోరుతున్నట్లు ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.