అయిజ, జూన్ 25: కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన 33 నూతన క్రస్ట్‌గేట్లను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఉదయం 10:45 గంటలకు వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు చేయగా, కేంద్ర మంత్రి సహా కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఒక్కొక్కరూ ఒక్కో క్రస్ట్‌గేట్ చొప్పున బటన్ నొక్కి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ 33 క్రస్ట్‌గేట్లను ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అనతి కాలంలోనే బిగించడం అభినందనీయమని కొనియాడారు. మూడు రాష్ర్టాలకు తుంగభద్రా ప్రాజెక్టు వరదాయిని అని చెప్పారు.
నీటి కేటాయింపుల విషయంలో ట్రిబ్యునళ్ల కేటాయింపులకు అనుగుణంగా సాగు, తాగునీటి అవసరాలను మూడు రాష్ర్టాలు సమన్వయంతో చర్చించుకొని వినియోగించుకోవాలని సూచించారు. 1953లో పురుడు పోసుకొన్న తుంగభద్ర ప్రాజెక్టు 73 ఏండ్లపాటు మూడు రాష్ర్టాలకు సాగు, తాగునీటిని అందించిందని తెలిపారు. 2024 ఆగస్టులో వరద కారణంగా డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో ఎన్డీఎస్ఏ నిపుణుల సూచనలతో కొత్త క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తుంగభద్ర జలాల సమర్థ నిర్వహణ, సాగు, తాగునీటి అవసరాలను మరింత బలోపేతం చేయడంలో గేట్ల పునరుద్ధరణ కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ర్టాల సాగునీటి సమస్యలను కేంద్ర జల్‌శక్తి మంత్రి శాశ్వతంగా పరిష్కరిస్తారని నమ్ముతున్నట్టు వెల్లడించారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు ఆర్డీఎస్ ద్వారా సాగునీటిని అందించేందుకు 17.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ కేవలం 5,6 టీఎంసీలనే రైతులు వినియోగిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 10 టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్కు చేరడం లేదని తెలిపారు. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడం, నీటి కేటాయింపుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా తుంగభద్రా నది ఒడ్డున జరిగిన చర్చలు గొప్ప నిర్ణయంగా మారబోతుందని, అంతర్రాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తుంగభద్రా జలాల విషయంలో రాజీపడబోమని స్పష్టంచేశారు. కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్‌ల శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు, ఆయా రాష్ర్టాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.