ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం.. గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కళాశాల పక్కనే ఉన్న హాస్టల్లో ఉంటున్నారు. రాత్రి భోజనం తర్వాత ఆ ఐదుగురు కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. మాల్‌వైపు నుంచి వస్తున్నవాహనం వెనుక నుంచి అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది.
వారిలో ఒక విద్యార్థి ప్రమాదం నుంచి తప్పించుకోగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన హర్ష(18)అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. నిర్మల్ జిల్లాకు చెందిన శివరాజ్(18)అనే విద్యార్థి నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ గురువారం ఉదయం మృతిచెందారు. మిగిలిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.