హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12 నుంచి 29 వరకు వరుసగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షల నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 12న ఇంగ్లిష్, 13న బోటనీ, 14న ఎకనామిక్స్, 20న కెమిస్ట్రీ, 21న తెలుగు, 22న ఫిజిక్స్, జువాలజీ, 25న కామర్స్, 26న సివిక్స్, అరబిక్స్, ప్రెంచ్, 27న హిందీ, 29న హిస్టరీ, సంస్కృతం లెక్చరర్ పరీక్షలు జరగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ పేర్కొన్నది.