హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎంఎం కృష్ణవేణిని బర్కత్‌పురలోని ఎండోమెంట్ ట్రిబ్యునల్ మెంబర్‌గా బదిలీ చేయగా, అక్కడ ట్రిబ్యునల్ సభ్యురాలిగా ఉన్న కే జ్యోతిని కమిషనర్ కార్యాలయంలో ఏడీసీగా బదిలీ చేశారు.
హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్(సర్వీసెస్)గా పనిచేస్తున్న కృష్ణప్రసాద్‌ను వరంగల్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న కే ఓంప్రకాశ్రావును హైదరాబాద్ ప్రధానకార్యాలయానికి బదిలీ చేయగా అక్కడ పనిచేస్తున్న వీ శ్రీనివాసశర్మను హైదరాబాద్ డీఈఈగా బదిలీ చేశారు. వీరితోపాటు ముగ్గురు ఏసీలు, 12 మంది గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారులను కూడా బదిలీ చేశారు.