Farm Influencers | వీరికి ఎప్పుడూ పొలం ధ్యాసే. లేచిన దగ్గర్నుంచి రైతన్నకు ఎలా సాయం చేయాలన్న ఆలోచనే. పలుగు, పార, నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే రైతన్నల కోసం.. కెమెరా, ట్రైపాడ్, డ్రోన్లు తీసుకొని క్షేత్రస్థాయికి వెళ్లిపోతారు. దుక్కి దున్నడం మొదలు.. పంట వెయ్యడం, మార్కెట్లో అమ్మడం వరకూ ప్రతీ దశలోనూ సలహాలు ఇస్తూ.. అన్నదాతకు అండగా ఉంటారు ‘ఫార్మ్ ఇన్ఫ్లుయెన్సర్స్’.
‘వ్యవసాయంలో మూస ధోరణిని ప్రశ్నిస్తూ ‘ఫార్మ్ ఇన్ఫ్లుయెన్సర్స్’ రంగంలోకి దిగారు. దుక్కిదున్నే దగ్గర్నుంచి.. పంట చేతికి వచ్చేంతవరకూ రైతన్నను అన్ని విధాలా చైతన్య పరుస్తున్నారు. లాభాల దిశగా అడుగులు వేయిస్తున్నారు. రైతులు కాకపోయినా.. రైతన్నల కోసమే పొలంబాట పట్టిన రైతుబిడ్డలు వీళ్లు.
దేశవ్యాప్తంగా చాలామంది ‘ఫార్మ్ ఇన్ఫ్లుయెన్సర్లు’ ఉన్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల్లో ఖాతాలు తెరిచి.. పల్లెపల్లెలో వాలిపోతున్నారు. అక్కడి రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు, ఉపయోగిస్తున్న సాంకేతికతను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులను రంగంలోకి దించుతున్నారు. కొత్తకొత్త విధానాలను రైతులకు నేర్పుతున్నారు. వాటిని అలవంబించేలా ప్రోత్సహిస్తున్నారు. ‘అంతత్వరగా రైతులు నమ్ముతారా?’ అంటే కచ్చితంగా నమ్ముతున్నారు. ఎందుకంటే, ఏ పంటకు ఏ నేల అనుకూలం? ఏ సమయంలో నాట్లువేయాలి? మన నేలకు తగిన కొత్త వాణిజ్య పంటలను ఎలా పండించాలి?.. ఇలా అన్ని రకాల పంటలు, నేలల గురించి విస్తృతంగా సమాచారం సేకరించి సోషల్ మీడియా ద్వారా రైతులకు చేరవేస్తున్నారు వీళ్లు. దుక్కి దున్నడం మొదలు.. ఫార్మ్ ఇన్ప్లుయెన్సర్లు ప్రతీ విషయాన్ని పక్కాగా తెలుసుకుంటారు. ఇందుకోసం వ్యవసాయ, ఉద్యానవన అధికారులను కలుస్తారు. వారినుంచి విలువైన సమాచారం సేకరించి, రైతులకు చెబుతారు. దుక్కుల దగ్గర్నుంచి విత్తనాల ఎంపిక, నాటే విధానం, ఎరువులు.. చీడపీడల నివారణ, పిచికారీలో నూతన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ విధానం, అధిక దిగుబడికి వాడే ఎరువులు, పురుగుమందులు, సేంద్రియ పద్ధతులు.. ఇలా ప్రతీ విషయాన్ని కూలంకషంగా వివరిస్తారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా రైతులకు చూపిస్తారు. అధిక లాభాలు సాధించిన రైతులతో మాట్లాడిస్తారు, నిపుణులతో సలహాలు ఇప్పిస్తారు. ఇలా రైతులకు ఉపయోగపడే ప్రతీ విషయంపై విస్తృతంగా వీడియోలు రూపొందిస్తున్నారు. అందుకే ఫార్మ్ ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షల్లో ఆన్లైన్ అనుచర గణం ఏర్పడుతున్నది.
మహారాష్ట్ర సాంగ్లీకి చెందిన రైతు బిడ్డలు.. సంతోష్ జాదవ్, ఆకాశ్ జాదవ్. వీరు చిన్ననాటి నుంచే స్నేహితులు. ఆకాశ్ మెకానికల్ ఇంజినీర్. సంతోష్ చదువు మధ్యలోనే ఆపేశాడు. 2018 లో వీరు రైతుల కోసం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ‘ఇండియన్ ఫార్మర్’ అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు. కేవలం నాలుగున్నర ఏండ్లలోనే 2.82 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు ఏర్పడ్డారు. ఇద్దరికీ కలిపి వారసత్వంగా 11 ఏకరాల భూమి వచ్చింది. అందులోనే మామిడి, క్యాప్సికమ్, టమాట, చెరకు పండిస్తున్నారు. కెమెరా, డ్రోన్, ఇతర వ్యవసాయ పరికరాలు పట్టుకొని పొలాలకు వెళ్లడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులను వివరించడం, అవసరమైన సూచనలు చేయడం.. వీరి దినచర్య. దేశమంతా తిరుగుతూ కొత్త వ్యవసాయ పద్ధతులనూ తెలుసుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా నెలకు రూ.80వేల ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి రైతు ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాల్లో చాలామందే ఉన్నారు.
హరియాణాలోని సిర్సాకు చెందిన రైతుబిడ్డ నరేశ్ చౌదరి. గతంలో ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేశాడు. అప్పుడే 60 పశువులను కొనుగోలు చేసి, వ్యవసాయం వైపు వచ్చాడు. ‘సాహెర్ మిల్కీ ల్యాండ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ఏర్పాటుచేశాడు. నరేశ్ తండ్రి మూస పద్ధతుల్లో గోధుమలు, పప్పుధాన్యాలు పండించి చాలా నష్టపోయాడు. దీంతో అతను ఆధునిక వ్యవసాయం, పాడి పరిశ్రమను నడిపిస్తూ.. ఫార్మ్ ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తాడు. ‘సాహెర్ మిల్కీ ల్యాండ్’ చానెల్‌కు లక్షా 14వేల సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. నరేశ్ ప్రభావంతో ఫార్మసిస్ట్ అయిన నిహాల్ జగ్తాప్ ఉద్యోగాన్ని వదిలేసి ఆధునిక వ్యవసాయం మొదలుపెట్టాడు. 90 టన్నులు వచ్చే చోట.. 130 టన్నుల చెరుకు పండిస్తున్నాడు.
“రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”