రంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారికి ఉపాధి కల్పించి తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. ఓ వైపు సర్కార్ కొలువులను భర్తీ చేస్తూనే మరోవైపు యువతకు పెద్దఎత్తున ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నది. గత ప్రభుత్వాలు మునుపెన్నడూ చేయని విధంగా ప్రతి వ్యక్తికి ఉపాధి లభించేలా ప్రభుత్వపరంగానే కాకుండా ప్రైవేటు సంస్థలతో మమేకమై వివిధ రకాల ఉద్యోగాలను కల్పిస్తూ నియామకాలు చేపడుతున్నది. ఏ ఒక్క వ్యక్తి ఖాళీగా ఉండొద్దనే కోణంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఉపాధి కల్పనకు పాటుపడుతున్నారు. ఇందుకు జిల్లాలోని ఉపాధి కల్పన శాఖను మాధ్యమంగా తీసుకొని ప్రధానంగా ప్రైవేటు సంస్థలకు కావాల్సిన ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు రకాల ఉద్యోగాలకు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో నియామకాలు చేపడుతున్నారు.
స్వీపర్ పోస్టుల నుంచి టెక్నికల్ పోస్టుల వరకు..
జిల్లా ఉపాధి కల్పన అధికార యంత్రాంగం చిన్న తరహా పోస్టుల నుంచి ఐటీ వరకు గల ఎన్నో వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఉద్యోగార్థులు చదువుకున్న వారైనా, కాకపోయినా వారివారి అర్హతల మేరకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఏడో తరగతి మొదలుకొని ఎస్సెస్సీ, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్‌కు కూడా ఇక్కడ నియామకాలు చేపడుతున్నారు. ఇందులో డ్రైవర్, స్వీపర్, క్లర్కులు, మొబైల్స్ మెకానిక్స్, సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్, స్టోర్ కీపర్స్, మేనేజర్స్, అకౌంటెంట్స్, ఎగ్జిక్యూటీవ్స్, అసోసియేట్స్, క్యాషియర్లు, సీసీఈలుగా ఉపాధి కల్పించేందుకు వివిధ రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఉద్యోగార్థుల యోగ్యతను బట్టి వేతనాలు కల్పిస్తున్నారు. వేతనాలు రూ.10 వేల నుంచి రూ.60 వేల దాకా ఉన్నాయి.
జిల్లాలో పలు చోట్ల జాబ్ మేళాలు..
జిల్లావ్యాప్తంగా ఉపాధి కల్పన శాఖ వారి ఆధ్వర్యంలో పలు చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. మేళాలను మినీ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా, జంబో మేళా అని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతి నెలకు తక్కువలో తక్కువగా రెండు, ఒక్కోసారి మూడు, నాలుగు మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. భర్తీ సంఖ్యను బట్టి మేళాలను మినీ, మెగాలుగా పేర్కొంటున్నారు. మేళాల్లో ‘అపోలో ఫార్మా, వెల్స్పన్, ఎరీనా యానిమేషన్, సెలెక్ట్ మొబైల్స్, బీపీవో కన్వర్జెన్స్, ముత్తూట్ ఫైనాన్స్, అమెజాన్, నవతా ట్రాన్స్పోర్ట్’ వంటి సంస్థలు నియామకాల్ని ‘జిల్లా ఉపాధి కల్పన శాఖ’ అధ్యక్షతన చేపడుతున్నాయి.
పది నెలల్లో 7,180 పోస్టులకు..
ఈ ఏడాదిలో నెలకు రెండు, లేదా అంతకంటే ఎక్కువ మేళాలను ఏర్పాటు చేస్తూ జిల్లావ్యాప్తంగా 7,180 పోస్టుల భర్తీకి నిరుద్యోగులకు అధికార యంత్రాంగం అవకాశాలు కల్పించింది. అందులో 3,223 పోస్టులను భర్తీ చేసినప్పటికీ, ఇక్కడ నిరుద్యోగులకు భృతి, ఉపాధి కల్పించడమనేది చెప్పుకోదగిన విషయం. ఇవే కాకుండా చదువుకోని మహిళలకు వివిధ రంగాల్లో 45 రోజుల పాటు తర్ఫీదును ఇచ్చి వారిని ‘జిల్లా ఉపాధి యంత్రాంగం’ నిష్ణాతులుగా మలుస్తున్నది. ‘టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మెహిందీ, బ్యూటీషియన్, డాటా ఆపరేటర్’ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చి వారికి తగిన పారితోషికంతో భృతి కల్పిస్తున్నారు.