న్యూఢిల్లీ, మే 30: ఇటీవలి ఇమిగ్రేషన్ ఆదేశాలపై వలసదారులలో ఏర్పడిన ఆందోళనలను తగ్గించేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్) చర్యలు చేపట్టింది. శాశ్వత నివాసం కోసం దరఖాస్తులు సమీక్షలో ఉన్నపుడు చాలా మంది గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు అమెరికాను విడిచి వెళ్లవలసిన అవసరం లేదని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితులు మినహా శాశ్వత నివాసం కోరుకునే వ్యక్తులు ప్రాసెసింగ్ వ్యవధిలో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని సూచిస్తూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేసిన ఒక ప్రకటన వలసదారులు, యజమానులు, ఇమిగ్రేషన్ అటార్నీలలో ఆందోళనను రేకెత్తించిన సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఒక దరఖాస్తుదారు అమెరికా వెలుపల నుండి గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేయాలా? వద్దా? అనే విషయాన్ని ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి నిర్ణయించే విచక్షణాధికారం ఇమిగ్రేషన్ అధికారులకు ఎప్పటి నుంచో ఉందని ఆ శాఖ పేర్కొంది. తాజా వివరణతో అమెరికా వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత విధానం ప్రకారం అర్హులైన వలసదారులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నపుడు అమెరికాలో నివసించవచ్చు.