తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రాజకీయ ముఖచిత్రాలు, సామాజిక నేపథ్యాలు, చారిత్రక అనుభవాలు వేర్వేరు. ఒక్కటి కానే కావు. ఈ ప్రాథమిక సత్యాన్ని కొందరు విశ్లేషకులు పదే పదే మర్చిపోవడం, లేదా మర్చిపోయినట్టు నటించడం తీవ్ర విచారకరం. తెలంగాణది కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అది ఉద్యమాల పోరుగడ్డ, ఆత్మగౌరవ ప్రతీక. ఈ చరిత్రను, ఈ నేల మనస్తత్వాన్ని, ఇక్కడి ప్రజల సున్నితత్వాన్ని అర్థం చేసుకోకుండా చేసే వ్యాఖ్యలు, విశ్లేషణలు లేదా ట్రోలింగ్ సహజంగానే ప్రతిస్పందనకు దారితీస్తుంది.
రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల చేసిన రాజకీయ విశ్లేషణపై విమర్శలు రావడం వేరు. కానీ ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్ చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం. ఇదే అదనుగా తెలంగాణ ఆలోచన దృక్పథం కలిగిన ఇతర జర్నలిస్టులను కూడా విమర్శించడం దారుణం. ఇక్కడ ఎవరూ నాగేశ్వర్ విశ్లేషణను గుడ్డిగానో, పూర్తిగానో సమర్థించలేదు. కానీ, విమర్శల పేరుతో సాగు తున్న వ్యక్తిగత వేధింపులను, అతివాద ధోరణిని మాత్రమే ప్రశ్నిం చారు. ఒకరి వ్యాఖ్యలను వంక పెట్టుకొని మొత్తం తెలంగాణ జర్న లిస్టులనే లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మరి తెలంగాణ సమాజం ఎప్పుడైనా ఆంధ్ర జర్నలిస్టులను ఇలా దూషించిందా?
జర్నలిస్టులు ప్రజా సమస్యలకు గొంతుకగా నిలుస్తారు. గ్రామం నుంచి ప్రపంచం వరకు, స్థానిక సమస్యల నుంచి పాలస్తీనా సంక్షోభం వరకు, పౌరహక్కుల నుంచి ప్రజాస్వామ్య విలువల వరకు మాట్లాడటమే పత్రికా స్వేచ్ఛ. అధికార దుర్వినియోగాలను ఎండగట్టి, నిజాలు రాసినందుకు ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల చరిత్ర ఈ నేలకు తెలుసు. అయితే, ప్రాణాలిచ్చే జర్నలిస్టులు ఉన్నట్టే, విద్వేషాన్ని రగిల్చే వాళ్లు కూడా మన చుట్టూరా ఉంటారు. తప్పు చేసేవారిని కచ్చితంగా గుర్తించి విమర్శించాలి, కానీ అందరినీ ఒకే గాటన కట్టి తీర్పు చెప్పడం సరికాదు. మహిళల బిల్లుపై సోషల్ మీడియాలో ఎంత విద్వేషాన్ని కక్కారో తెలంగాణ సమాజం చూసింది. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కేసులో ఏ మీడియా నిజం చెప్పింది? ఏ మీడియా రాజకీయ ప్రయోజనాల కోసం కథనాలను వాడుకున్నది? ఇవన్నీ ప్రజలు గమనించలేదని అనుకుంటే పొరపాటు.
పచ్చ మీడియాలో ప్రతిరోజూ తెలంగాణపై విద్వేషపూరిత వార్తలు, వక్రీకరణలు, ఎటకారాలు కనిపిస్తూనే ఉంటాయి. అయినా ఇక్కడి ప్రజలు ప్రతిసారీ దీన్ని రెండు రాష్ర్టాల మధ్య గొడవగా మార్చలేదు. ఇక్కడి వీధుల్లోనే కార్పొరేట్ కార్యాలయాలు పెట్టుకొని, తెలంగాణ అసలు సమస్యలను, పేదల కష్టాలను తొక్కేసే మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి. టెండర్లు, కాంట్రాక్టులు, రాజకీయ ఎజెండాల కోసం మాత్రమే వార్తలు రాస్తూ, ఆ తర్వాత మళ్లీ తెలంగాణపైనే విషం చిమ్మే ఇటువంటి సంస్థలను ప్రజలు గమనిస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ విద్వేషం అని మాట్లాడుతున్న వాళ్లకు ఒక్కటే ప్రశ్న. మొన్ననే కదా హైదరాబాద్ నడి మధ్యలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ పాట పాడనని చెప్పిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతి ప్రాంగణంలో సగౌరవంగా ప్రతిష్ఠించుకున్నాం. ‘కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న వాళ్ల తాలూకా’ సినిమాలను కూడా ఆదరించాం. మరి నిజంగా ఎవరు ఎవరిని ద్వేషిస్తున్నారు? మా మీద అక్కసు, అసూయ, ఎటకారాలు వెళ్లగక్కిన వారిని ‘వాళ్లు కూడా మన తెలుగు వాళ్లే కదా’ అని ఎన్నోసార్లు పెద్దమనసుతో ఊరుకున్నాం. కానీ, ఇటువంటి ద్వేషపూరిత ధోరణులు, ప్రాంతీయ అహంకారాలు, నిరంతర అవమానాలే గతంలో తెలంగాణ ఉద్యమానికి పునాది వేశాయని మర్చిపోవద్దు. అందుకే ఈ అంశాన్ని మళ్లీ రెండు రాష్ర్టాల ప్రజల పంచాయితీగా మార్చే ప్రయత్నం చేయకండి.
ప్రస్తుతం కొందరు రాజకీయ శక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు, కొన్ని మీడియా వర్గాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదాన్ని కావాలనే పెద్దది చేసి, రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల ప్రజలు ఈ రాజకీయ ఆటలను గుర్తించాలి. లేనిపక్షంలో అభివృద్ధి, ఉపాధి, విద్య, వ్యవసాయం, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రెండు రాష్ర్టాలు.. విద్వేష రాజకీయాల బారిన పడి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉన్నది. ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండొచ్చు, కానీ ప్రజల మధ్య విద్వేషం వద్దు. ఇక ఇక్కడి కొందరు పెద్దలు ఎవరి పార్టీ వైభోగం తెలంగాణలో రావాలని పచ్చని కలలు కంటున్నారో, ఏ పార్టీలో ఉండి ఎవరికి వత్తాసు పలుకుతున్నారో, ఎవరి విగ్రహాలు నిలబడుతున్నాయో, ఎవరి కార్యాచరణలు నడుస్తున్నాయో, ఎవరి పార్టీ ఫండ్లు ఏ ఊర్లోకి చేరుతున్నాయో, ప్రజల మీద ఎవరి పేర్లను రుద్దాలని చూస్తున్నారో, తెలంగాణ సమాజం నిశితంగా పరిశీ లిస్తున్నది. ఎంతమందిని కొన్నా, ఎంత ప్రచారం చేసినా.. తెలంగాణ అస్తిత్వం ముందు, ఉద్యమాల చరిత్ర ముందు ఏ విగ్రహాలు, ఏ పేర్లు, ఏ రాజకీయ హడావుడీ శాశ్వతంకావు. కాలగమనంలో ఇవన్నీ నామరూపాలు లేకుండా పోతాయనే సోయి.. ఈ సమాజానికి ఉన్నది.
ఉద్యమాలతో నిలిచిన నేల ఇది. ఎవరి మాటలు, ఎవరి ఎత్తుగడలు, ఎవరి ఆశలు ఏ దారికి తీసుకెళ్తాయో గుర్తించే తెలివి ఈ మట్టికి ఉన్నది. ఎన్నో అణచివేత రాజకీయ వ్యూహాలను చూసి, ఎన్నో అధిపత్యాలను తట్టుకొని, సమయం వచ్చినప్పుడల్లా వాటి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన చరిత్ర తెలంగాణది. అందుకే… మీ ఎత్తుగడలు మీరు కొనసాగించండి. మీ మాటలు మీరు చెబుతూ ఉండండి. మేం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే తెలంగాణకు అన్నీ గుర్తుంచుకోవడం తెలుసు… సరైన సమయంలో జవాబు చెప్పడం కూడా తెలుసు! తెలంగాణ సోయి ముందు ద్రోహుల కుట్రలు సాగవు, తస్మాత్ జాగ్రత్త!
– (వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) గాదె సంధ్యారాణి