NRI BRS | బహ్రెయిన్: కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ దాడిని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పింది. కానీ వెయ్యి రోజులైనా పూర్తి చేయలేదు. వీటిపై బీఆర్ఎస్ పోరాడుతుంటే ఎదుర్కొనే శక్తి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ నివాసంపై దాడికి దిగడం శోచనీయమని అన్నారు.
20 సంవత్సరాల్లో ఇలాంటి దారుణాన్ని ఎప్పుడూ చూడలేదని సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మంగళవారం కాంగ్రెస్ పార్టీ వందల మంది నాయకులు కేసీఆర్ నివాసాన్ని ఎలా ముట్టడిస్తారని విమర్శించారు. ఈ దాడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకోకుండా కేసీఆర్ రక్షణ కోసం వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు.
తెలంగాణ సాధకులుగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ నిలిచారు. అలాంటి కేసీఆర్ చావు కోరడం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కడమేనా ప్రజా పాలనా అంటే అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం గమనిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.