కాళేశ్వర వైభవం
తెలంగాణ కలలు పండగా జలయజ్ఞానికి సమాయత్తమై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ రూపురేఖలు దిద్ది
తెలంగాణ జల సాగరం
కందము: నీటికి కటకటనాడిట
బీటలు వారిన పొలాలు
బీడగు భూముల్!
నేటికి పోయెను కలతలు
మేటిలు నా మెతుకుసీమ
మెదకున్ఁ జూడన్!
కం: కాళేశ్వర ప్రాజక్టై
నాళాలుగ నీరు పైకి
నరుగుచు నుండెన్!
వేళాకోళము కాదిది
నళ్ళాలును మంచినీళ్ళు
నగరములందున్!
కం: వరిసాగు నధికమాయెను
యిరుగాలము పంటపొలము
లే; కనిపించెన్!
ధరలో సిద్ధించె జలము
లరయగ నీ సిద్ధిపేట
లాలాజలమే!
కం: మల్లన్న సాగరమ్మును,
పల్లెలకున్ సంగమేశు
ప్రాజెక్టులతో!
జిల్లాలో బసవేశ్వరు
డుల్లాసపు నీటికాల్వ
లుమ్మడి మెదకున్!
కం: గౌతమి కాళేశుని విడి
ప్రీతిగ నెదురెక్కి వచ్చె
ప్రేమలు పంచన్!
ఆతరమున కీతరమున
శాతనుచేయంగ నిల్చె
సాగుకు తోడై!
కం: కలి కలకల కలముల నిల
గలగల జలకళల నిలువ
గలపలు చెలిమెల్!
కలి మలినములను పులుముచు
జలములు పలు నెలవులలరె
జల సాగరమై!
కం: కలలగు సలిలపు తలపులు
సిలసిల సిలవలపు లలర
సెలయేరులుగా!
జలసిరి కులుకుల నెలమిన!
పలుకుల గలగలల విలువ
బలముల నొసగన్!
కం: శివునికి శిఖలో గౌతమి
ధవుడౌ ముక్తీశు వీడి
ధారగ చేరెన్!
వివిధ విశాలపు నదిసం
భవ మల్లన్నాది సంగ
బసవేశు గనెన్!
దక్షిణ తెలగాణమ్మును
సుక్షితి గానాదుకొనుచు
శుభముల నొసగే!
సాక్షీభూతము గౌతమి
నక్షయ సిధ్ధులను నిచ్చు
నరయగ నెపుడున్!
- మాడుగుల మురళీధర శర్మ
99519 85880
జలకళ శోభల సత్వదీప్తి!
కరువు కాటకములు కల్లోలమును బెట్ట
పిల్లపాపల బెంచు పెంపు లేక
చుక్కనీరము లేక చూచు నాథుడు లేక
పొట్ట చేతను బట్టి పట్టణముల
ఆత్మగౌరవ దీప్తి నంత నావల బెట్టి
కూలీలుగా మారి కొలువు సేసి
రైతన్న కన్నీరు రాల్చిన నేలపై
మల్లన్న సాగరు మహిమ వెలిసె!
ఒక్క నాయకమ్మన్యుని చక్కనైన
దూర దృష్టిని సంకల్ప సార మహిమ
అధమ గతినున్న వ్యవసాయ మంత లేచి
పరుగు లెత్తె పురోగతి పథము నందు!
అనుకూలమైనట్టి అభివృద్ధి సాధింప
దీక్ష బూనిన నేత దక్షుడగుట
నెర్ర లూనిన బీడు నేలలు ఈనాడు
పచ్చని పంటతో ప్రభలనీనె
త్రాగు నీరంబుకై సాగు నీరంబుకై
అంగలార్చిన నేల పొంగె నేడు
తెలగాణ ప్రాంతమ్ము దీపించె దేశాన
జల కళ శోభల సత్వ దీప్తి!
రైతు కనుకూలమైనట్టి రాజ్యమందు
లక్ష్మి నర్తించె, సౌభాగ్య లక్ష్మి వెలసె
ప్రగతి పథమందు తెలగాణ ప్రభుత నడవ
దేశమున నద్ది ఆదర్శ దివ్వె యయ్యె!
స్వయముగా రైతునై సాగురీతి నెఱిగి
పరిశోధనలు సేయు పటిమ కతన
కష్ట సుఖంబుల కలరూపు నెఱిగిన
శ్రమ తత్త్వ మాత్మలో రాజిలంగ
పలు ప్రయోజనమైన పథకాలు యోచించి
అధికారులను బంచి అమలు సేసి
దారిద్ర భూతంబు దరుమంగ నిష్ఠతో
శ్రమియించు నశ్రాంత శ్రామికుండు!
నేతయై యొప్ప కర్షక ప్రీతుడయ్యె
పల్లెలను వీడి యొక నాడు పట్టణముల
బాట బట్టిన ప్రజలు సంభరిత సంత
సమున పల్లెలన్ జేరు సమయమొచ్చె!
కలలుగా మిగిలిన అలఘు ప్రాజెక్టులు
తెలగాణ రాష్ర్టాన తేట బడగ
కొండపాకయును తొగుట మండలముల
మధ్యన ప్రజల సంపదలు బెరుగ
మల్లన్న సాగరు మాన్యమౌ ప్రాజెక్ట్
రూపకల్పన సేసి ప్రాపు నిలిచి
సృజియించి సంపదన్ స్థిరమైన ప్రగతిని
దేశాని కందించు దీక్ష గొనిన
ప్రభుత యేలంగ ఉత్సాహవంతులైన
ప్రజలు సహకార మందించ పల్లెలందు
రైతు పూజనీయుడునై విభూతి నందె;
అట్టి నేతల కగుగాక అభ్యుదయము!
- పాలకుర్తి రామమూర్తి
94416 66943

జల దీప్తి మల్లన్న
నడక మార్చిన గోదావరి
మల్లన్న సాగరమై
గంగావతరణ ఘట్టానికి తెర తీసి
అపర భగీరథుని కోర్కెను మన్నించె!
తడి ఆరని నేల తల్లి
తెలంగాణ నుదిటి మీద
హరిత స్వప్నాన్ని లిఖించి
బంగారు తెలంగాణ భాగ్యమై మెరిసె!
కనువిందు చేస్తున్న మల్లన్న సాగరం
ఉద్యమ నేత మనసు పసిగట్టి
మన కోటి ఎకరాల సాగు కలకు
జలతోరణం కట్టి శుభం పలికె!
చిత్తశుద్ధి కార్యాచరణలేని స్వప్నాలకు
భరత వాక్యం పలికిన పోరుగడ్డ
మన తెలంగాణమే నీటి చైతన్యమై..
భావి బంగారు భారతానికి దిక్సూచియై నిలిచె!
సముద్రంలో అదృశ్యమయ్యే
ఏ నదికీ విముక్తి దొరకదు
మట్టి దాహం తీర్చని గంగమ్మను
మల్లన్నైనా ఏనాడూ శిఖలో ధరించడు!
నదుల్ని సముద్రాల పాల్జేసి
చీటికీ మాటికీ కాలాన్ని నిందించడం
కిటుకు తెలిసిన నేతెన్నడు చేయడు
నడుం బిగించి గడప గడపకు చేర్చుతాడు!
నది.. నేలను తడిపినంత దూరం
నాగరికత వెంట నడుస్తది
కృషీవలుని దేశంలో
రైతే రాజై రాజ్యమేలుతాడు!
వలసెల్లిన మనుషులూ పక్షులూ
మనసు మళ్ళి తిరిగొస్తుంటే
తెలంగాణ మట్టి బంగారమై మెరుస్తుంటే
దేశం మోరలెత్తి చూస్తున్నది!
తాగునీటికీ.. సాగునీటికీ
అర్రులు సాచిన కాలాన్ని చవిచూసిన
మన కవుల కలాలకు ఇవ్వాళ
మల్లన్న సాగరం మరో ‘జలకవితోత్సవ’దీప్తి!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
జాతిరత్నం
కదిలే నదివోలె
ఊటబాయి మోట గిలకోలే
ఉత్తుంగ తరంగమై, ఉద్యమ కెరటమై
ఆనకట్టలు నిర్మించిన
అపర భగీరథుడు చంద్రశేఖరుడు
సంగమేశ్వర, బసవేశ్వర ఆనకట్టలకు
రూపుకట్టిన ఘన హితాత్ముండు
తడి ఇంకిపోయిన భూతల్లి గుండెలకు
మల్లన్న సాగర్ నీటితో లేపనం పూసి
జల సిరి ఒంపిన జాతి రత్నం!
సాగునీటితో సస్యశ్యామలమై
నీటి పొదుగుతో ఉరకలెత్తుతోంది!
గంగను ధరణికి దింపి
మల్లన్న సాగర్ నీటితో
దిగంతాన్ని మురిపించిన
చిర యశస్వి!సేవా తపస్వి!!
- దాసరి (జంగిటి) శాంతకుమారి
96524 83644
పుడమి సంతసం
కందం: మల్లన సాగరు ప్రజలకు
ఉల్లము సంతోషమయ్యి నురకలువేయన్
యెల్లలు జలమయ మవ్వగ
చల్లగ రైతన్న బతుకు సాగుచు నుండన్!
ఆ.వె: సాగు నీరునంద సాగించు యవుసంబు
రైతుసోదరులది రాజ్యమవగ
అన్న దాతశ్రమకు నవనిపై మల్లన్న
సాగరంబునిలుప సంతసంబు!
ఆ.వె: కర్షకులకునెంతొ కన్నులపండువే
కొమురవెళ్ళిదేవ కోర్కెదీర్చ
కేసియారుసారు కెంతెంత పుణ్యమో
కష్టజనులదలిచె కడుపునిండ
పెద్దపనులుజేయ పెడబొబ్బలవ్వగా
మంచి కార్యమనుచు మరిచిజనులు
శాశ్వతమ్ము పనులు సాగించు సమయాన
తప్పవనిరి జనులు తిప్పలయిన
వేల ఎకరాల భూమికి విలువ పెరిగి
పచ్చదనముతో నిండును పసిడిపైరు
రైతు హృదయాన యానంద లాస్యమవదె
మల్లికార్జునదేవుని మహిమవలన
బోసిబోయిన ప్రాంతాన భూరిగాను
నీరు నిల్వయ్యి ప్రాజెక్టు నివ్వజనులు
దేవ ప్రభుతకు జేజేలు దివ్యముగను
మానసంబున యర్పించె మంగిడీలు!
ఏడువేయిలకోట్లతో ఏరుపాటు
మూడునేడులలోపలే ముగియ డ్యాము
పూర్తిగావించ నీరంది పుడమితల్లి
జలదరించెను ప్రాంతంబు జలముచేత
సంతసంబాయె రైతన్న సంతులితము!
- సింగీతం నర్సింహారావు
94400 82388
అపర భగీరధుడు
తెలంగాణ కలలు పండగా
జలయజ్ఞానికి సమాయత్తమై
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించి
రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ రూపురేఖలు దిద్ది
మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో కొమురెల్లి మల్లన్నకు
జలాభిషేకాలు చేసి
కులదేవత కొండపోచమ్మ పాదాలు కడిగి
మెతుకు సీమ బాదలుబాపి
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడా చంద్రశేఖరుడా
నిన్నుగన్న తెలంగాణ గర్వంగా తలెత్తుకున్నది
తెలంగాణ తల్లి తనయుని ఎదకు హత్తుకొని
అపర భగీరథుడిని మురిపంగా ముద్దాడినది!
- లక్కిరెడ్డి విజయ
శుభాకర్రెడ్డి
93936 65222
మంచినీటి సాగరం
ఎత్తిపోతలే కొత్త నడకలై.. చెంగున ఎగిరే లేగదూడలై
పల్లె భామకే పచ్చకోకలై.. ఫలాల కలలే పండునిజాలై
గోదారమ్మ గొంతు తడపగా.. బీడుభూముల దాహం తీరగా
మల్లన్న మురిసె సాగరమవగా.. రాతిగుండెలే జలకాలాడగా
కాలువలన్నీ కలిసిపారగా.. చెరువులు నిండి మత్తడి దుంకగా
తెలంగాణలో తేమగీతాలు.. బీడు భూములకు జలగానాలు
పొలాలనన్నీ హలాలు దున్నగా.. పొంగేజలాలు పంటలు తడుపగా
మండుటెండలో మత్తడి దుంకగా.. చెరువుల నిండా పిల్లలు ఈదగా
వాగులు వంకలు గెంతులేయగా.. పశుపక్షాదులు పరవశింపగా
పగుళ్ళ భూమికి దాహం తీరగా.. చెట్ల వేర్లకే చేవ నిండగా
ప్రకృతి తానే పచ్చబడగా.. పూర్వ స్మృతులే పూలు చల్లగా
పాకే కొడుకు పరుగుతీయగా.. కోడెగిత్తలా మనసుప్పొంగగా
తెలగాణంలో పంటల వర్షం.. రైతు మోములో మొలకల హర్షం
హరీశులదే ఆనందతాండవం.. నిండు చంద్రునిదే విజయవిహారం!!
- కొమురవెల్లి అంజయ్య
98480 05676
మహోదయం!
తెలంగాణలో మహోదయం
కాళేశ్వరమే పచ్చతోరణం!
తళ తళా.. గలగలా కాళేశ్వరం జల తరంగాలు
చేతులు తాకిన కొండలకే చలనం వచ్చెనులే
పరుగులీడుతూ రాజన్న సన్నిధికి చేరెనులే!
కాళేశ్వరం జల కుండ
ఉద్యమ గడ్డ దుబ్బాక నెత్తిన మల్లన్నసాగరమై..
తెలంగాణ మాగాణి మడి తడుపుతున్నదే!
గ్రహములు పాడిన ఎల్లలకే
నందీశ్వరుడు ఊగెనులే!
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే..
రంగనాయక సన్నిధిలో వెలిసిన
సిద్దిపేట జలద్వీప సౌందర్యం నీవేలే..!
నీలాకాశం దిగివచ్చే మేడిగడ్డ
ముక్తీశ్వర సన్నిధిలో కాళేశ్వరం వెలిసెనులే..!
నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణం
ధాన్యం రాశుల సిరుల మూట..!!
– చిటుకుల మైసారెడ్డి
94905 24724
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- kaleshwaram
- pride
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

