హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, అభ్యంతరాల పరిషార ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92,88,181 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 28 సెప్టెంబర్ 2026 నాటికి 87,85,739 మందికి అందజేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు అందిన నోటీసులకు సంబంధించి అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిషారానికి అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 58,97,432 విచారణలు పూర్తికాగా, 45,54,236 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అర్హులుగా తేలారు. మిగిలిన నోటీసుల పంపిణీతో పాటు పెండింగ్ విచారణలను సైతం త్వరితగతిన పూర్తి చేసి, లోటుపాట్లు లేని పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మాసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్‌గాంధీ సాక్ష్యాధారాలతో బయటపెట్టారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఓట్ చోరీ ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు.