హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లను సర్కార్ రెన్యువల్ చేయలేదు. దీంతో కాలేజీల్లో క్లాసులు జరుగడంలేదు. రాష్ట్రంలో10 ప్రభుత్వ డైట్ కాలేజీలున్నాయి. ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్‌తోపాటు మూడు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీలున్నాయి.
డైట్ కాలేజీల్లో 286 పోస్టులుండగా రెగ్యులర్ లెక్చరర్లు 10 మంది లోపే ఉన్నారు. మిగతా వారంతా గెస్ట్ లెక్చరర్లే. బీఈడీ కాలేజీల్లో 60 మంది వరకు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మొత్తంగా 250 మంది గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం ఇంతవరకు రెన్యువల్ చేయలేదు.
డైట్ కాలేజీల్లో ఈ నెల 15 నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. బీఈడీ కాలేజీల్లో జూన్ 1నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. డైట్‌కాలేజీల్లో, బీఈడీ కాలేజీల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. 90శాతానికి పైగా పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీలు, గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తున్నారు. డైట్, బీఈడీ కాలేజీల్లో గతంలో పనిచేసిన వారిని రెన్యువల్ చేయలేదు. ఫీజు స్వీకరించే వారు కూడా లేని పరిస్థితుల్లో కాలేజీలున్నట్టు విద్యార్థులు వాపోతున్నారు.