న్యూఢిల్లీ, జూలై 30 : ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో పెల్లెట్ గన్ల వల్ల గాయపడిన నిరసనకారులకు తగిన వైద్య చికిత్స అందించాలని సుప్రీం కోర్టు గురువారం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జంతర్ మంతర్ నిరసనలో నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) వినియోగించిన ఆయుధాలు, ముందుగుండు సామగ్రికి సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్‌లు జోయ్‌మాల్య బాగ్చీ, వీ మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. అయితే పెల్లెట్ గన్ల వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని ఉపయోగించవచ్చునని పేర్కొంది. పెల్లెట్ గన్ల వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ధర్మాసనం వివరణ కోరింది.