Suicide : అమెరికా (USA) లో ఉన్నత విద్య పూర్తిచేసి మంచి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న హైదరాబాదీ యువకుడు సాయిప్రదీప్ (Saipradeep) జీవితం విషాదాంతమైంది. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక తీవ్ర మనస్తాపానికి గురై అతడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సాయిప్రదీప్ 2024లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రం (Texas State) లోని శాన్ ఆంటోనియోలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలని భావించాడు.
అయితే గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం దక్కలేదు. వరుసగా అవకాశాలు చేజారడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన సాయిప్రదీప్ మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 21న శాన్ ఆంటోనియోలోని తన గదిలో సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో.. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పలువురు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి మరోసారి చర్చనీయాంశమైంది. చదువు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు యువతపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.