Donald Trump : ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధంతో పశ్చిమాసియా (West Asia) లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్ (Project Freedom)’ కు బ్రేక్ పడింది. ఇరాన్‌తో దౌత్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టు పెట్టారు.
పాకిస్థాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై సాధించిన విజయాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రతినిధులతో ఒక సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా కొనసాగుతోన్న ప్రయత్నాల్లో పురోగతి సాధించామన్నారు. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టంచేశారు. ఒప్పందంపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్ బహిరంగ ప్రకటనలకు విరుద్ధంగా తమతో ఒక ఒప్పందం చేసుకునేందుకు రహస్యంగా ప్రయత్నిస్తుందని ట్రంప్ అన్నారు.
ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించారు. తాము పూర్తిస్థాయిలో పోరాటానికి దిగితే ఇరాన్ ఆపలేదని వ్యాఖ్యానించారు. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో విదేశీ నౌకలను జలసంధి నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో ట్రంప్ ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రకటించారు. దీన్ని మానవతా చర్యగా అభివర్ణించారు. కాగా ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను ప్రారంభించిన కొన్ని గంటలకే దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం చర్చకు దారితీసింది. ట్రంప్ నిర్ణయాన్ని ఇరాన్ తాను సాధించిన విజయంగా చెప్పుకుంటోంది.