మాస్కో: పులి ఎక్కడన్నా పాడుతుందా? ఇదేం ప్రశ్న అని అనుకోవద్దు. రష్యాలోని ఒక జూకు వెళితే ఎంతో చక్కడా పాడే పులి కనిపిస్తుంది. సందర్శకులు దీని రాగం విని ఆశ్చర్యపోతున్నారు. సైబీరియన్ నగరంలోని బర్నాల్లో లెస్నాయ స్కజ్కా పేరుతో ఒక జూ ఉన్నది. షేర్ఖాన్ ద్వారా బగీరా అనే ఆడ పులి 2020 జూన్లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అముర్ అనే ఎనిమిది నెలల పులి పిల్ల ఇటీవల వింతగా గాండ్రిస్తున్నది. దాని అరుపు పాడుతున్నట్లుగా చాలా శ్రావ్యంగా ఉన్నది.
జూ సిబ్బంది ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ పులి గొంతుకకు ఏమైనా గాయం అయ్యిందా అని అనుమానించి పరిశీలించారు. అయితే అది ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. కేవలం తన తల్లి దృష్టిని ఆకట్టుకునేందుకు ఆ పులి పిల్ల ఈ విధంగా శ్రావ్యంగా అరుస్తున్నదని గ్రహించారు. ఇది చాలా అరుదైన విషయమని జూ సిబ్బంది తెలిపారు.
కాగా, పాడుతున్న మాదిరిగా, కూనిరాగం తీస్తున్నట్లుగా ఉన్న ఆ పులి అరుపు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.