ఆమె సెలెబ్రిటీ ఫిట్నెస్ కోచ్. అయినా సరే, అందం తారలకు మాత్రమే సొంతమని అనుకోలేదు. అందుకే, తృత్వాన్నిపొందిన మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఫిట్నెస్ కార్యక్రమాన్ని రూపొందించారు. అందం, ఆరోగ్యం ద్వారా అమ్మల ఆత్మవిశ్వాసం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు.జుంబా ట్రైనర్‌గా దేశవ్యాప్తంగాపేరు పొందిన సుచేతా పాల్ ఈ దిశగా తన ప్రయాణాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారు..
నేను జుంబాను హ్యాపీ డ్రగ్ అని పిలుస్తాను. ఆ సమయంలో మనల్ని మనం మరిచిపోతాం. తపస్సు, ధ్యానం, వ్యాయామం.. ఆ అనుభూతిని ఏ పేరుతో అయినా పిలవండి. సరిహద్దుల్లోని మిలిటరీ క్వార్టర్స్‌లో సైనికాధికారుల భార్యలకు కూడా శిక్షణ ఇచ్చాను. ఒత్తిడిని తరిమేయడంలో జుంబా చాలా ఉపయోగపడిందని వాళ్లంతా చెప్పారు.
జుంబా.. చాలామందికి సుపరిచితం. అమెరికాలో రూపుదిద్దుకున్న ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ నృత్యంలోని ఆనందానుభూతినీ పంచుతుంది. దీన్ని భారత్‌కు తీసుకురావడంలో నేను ప్రధాన పాత్ర పోషించాను. అక్కడితో ఆగలేదు. వేలమందికి శిక్షణ ఇచ్చాను. ఆ ప్రయత్నం ఫిట్నెస్ ట్రైనర్‌గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. గౌరీఖాన్, యామీ గౌతమ్, బిపాషా బసులాంటి సెలె బ్రిటీలకూ నేను ట్రైనింగ్ ఇస్తాను. అయితే, తళుకు బెళుకుల ప్రపంచానికి దూరంగా.. అతి సాధారణ జీవితం గడుపుతున్న అమ్మల కోసం ప్రత్యేకంగా ఫిట్నెస్ ప్రోగ్రాం డిజైన్ చేయడంలో నేను పొందిన సంతృప్తి మాత్రం అపారమైంది, అమూల్యమైంది.
అందరిలానే..
నేను జార్ఖండ్‌లోని రాంచీలో పుట్టాను. అక్కడే చదువుకున్నాను. అందరు అమ్మాయిల్లానే బీటెక్ తర్వాత అవకాశాల్ని వెదుక్కుంటూ ముంబై వచ్చాను. ఓ ఐటీ కంపెనీలో చేరాను. దాదాపు అయిదేండ్లు అక్కడ పనిచేశాను. కానీ ఆ ఒత్తిడి, జీవనశైలి నాకు సరిపడలేదు. తక్షణం ఉద్యోగం మానేశాను. కొంత గ్యాప్ తీసుకున్నాక.. మా వారికి అమెరికాలో ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్లాను.
కానీ ఏదో నైరాశ్యం నన్ను ఆవహించింది. ఐడెంటిటీ క్రైసిస్ మొదలైంది. అసలు నా ప్రత్యేకత ఏమిటి, నేనేం చేయగలను.. ఇలా ఏదేదో ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అదే సమయంలో జుంబా పరిచయమైంది. నాకు తొలి నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టం. దీంతో త్వరగా కనెక్ట్ అయ్యాను. అది నాకు థెరపీలా పనిచేసింది. నిత్యం సాధన చేసి.. ఇతరులకు శిక్షణ ఇచ్చే స్థాయికి వెళ్లాను. భారత్‌లో జుంబా ట్రైనింగ్ పరిచయం చేయాలని భావించినప్పుడు, ఆ సంస్థ నన్ను మాస్టర్ ట్రైనర్‌గా ఎంచుకుంది.
అదే మలుపు
జుంబా ట్రైనర్‌గా పాపులర్ కావడంతో ప్రభుత్వ గుర్తింపూ లభించింది. ఫిట్నెస్ రంగంలో నా కృషికి గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్ లేడీ’ (2018) అవార్డు అందుకున్నాను. ఆ క్షణం నుంచే మహిళల కోసం ఏదైనా చేయాలనే తపన మొదలైంది. ఆ దిశగా చాలా ఆలోచన సాగింది. మరుసటి ఏడాది నేను గర్భం ధరించాను. తొలి మూడు నెలలూ నేను నేనుగా లేను. ఎంత ఫిట్నెస్ ట్రైనర్‌ని అయినా, నా శరీరం నాదిగా అనిపించలేదు. బాబు పుట్టాక కూడా పరిస్థితి అలాగే ఉండేది. గర్భధారణ, ప్రసవానంతర దశల్లో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆడవాళ్లు ఫిట్నెస్ కోల్పోయేది ఇప్పుడే. అందుకే, ఈ సమయంలో నేను స్వయంగా సాధన చేసిన వ్యాయామాలు, లోతైన పరిశోధనల ఆధారంగా ఆవిష్కరించినవీ.. అన్నీ కలిపి మామ్.బీఓడీ.స్ట్రాంగ్ (Mom.Bod.Strong) పేరిట ఒక ఫిట్నెస్ కార్యక్రమాన్ని రూపొందించాను. పొత్తి కడుపు, కటి ప్రాంతాలను శక్తివంతం చేసే ఆ కసరత్తులు అరవై దాకా ఉంటాయి. ఆరువారాల నిడివితో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఇప్పటిదాకా వంద మందికిపైగా అమ్మలకు ట్రైనింగ్ ఇచ్చాను. ప్రసవం తర్వాత కూడా పొత్తి కడుపు ఎత్తుగా కనిపించడం, నవ్వినా తుమ్మినా చుక్కలుగా మూత్రం పడటం, నడుము నొప్పి.. ఇలా రకరకాల సమస్యలు తల్లులను ఇబ్బంది పెడతాయి. వీటన్నిటినీ అధిగమించి మళ్లీ మునుపటి బలాన్ని సంతరించుకునేలా చేయడమే దీని లక్ష్యం.
ప్రసవమైన మూడు నెలల తర్వాత నుంచి ఎప్పుడైనా ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లో చేరొచ్చు. నా సోషల్ మీడియా ఎకౌంట్లో వీటికి సంబంధించి వీడియోలు కూడా పెట్టాను. ఎవరైనా చూడొచ్చు. ప్రసవం తర్వాత రకరకాల సమస్యల్ని ఎదుర్కొన్న మహిళలు.. నా శిక్షణలో ఫిట్నెస్ సాధించి, మళ్లీ గర్భం దాల్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. తాము మళ్లీ మును
పటిలా మారగలమన్న నమ్మకంతో ఈ సారి మరింత ధైర్యంగా బిడ్డకు జన్మనిస్తారు.
మన దగ్గర స్త్రీలలో ఫిట్నెస్ అవగాహన తక్కువ. దీనికితోడు అనేక అపోహలు, మూఢ నమ్మకాలు. ఆ దిశగా అవగాహన కల్పించేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. మరింతమంది తల్లులను దృఢంగా తయారు
చేయాలనేది ఓ అమ్మగా నా సంకల్పం.
లక్ష్మీహరిత ఇంద్రగంటి