ఇడ్లీ, దోశ, వడ.. మనకు ఇష్టమైన ఫలహారాలు. నిత్యం ఆరగించే రుచులు కూడా. వాటిని విదేశాల్లోనూ పరిచయం చేయాలనుకున్నారు తమిళనాడుకు చెందిన సుబ్రమణియన్ కృష్ణన్, ఆనంది దంపతులు. Shasthaonline.com (Shastha foods) పేరున ఓ స్టోర్ ప్రారంభించి 18 ఏండ్లుగా దోశ, ఇడ్లీ, వడ పిండితోపాటు అప్పడాలు, పచ్చళ్ల లాంటి దక్షిణాది రుచులను ‘రెడీ టు కుక్’ మిక్స్‌ల రూపంలో విక్రయిస్తున్నారు. అంతేకాదు, అమ్మమ్మల పద్ధతిలోనే బియ్యం, పప్పు నానబెట్టి భారీ స్టోన్ గ్రైండర్లో రుబ్బి పులియ బెట్టడం వీరి ప్రత్యేకత. అమెరికాలో ఈ సంస్థకు 35 స్టోర్లు ఉన్నాయి. ‘శాస్తాఫుడ్స్’ ఇప్పటివరకు పది కోట్లకుపైగా దోశలకు సరిపడా పిండిని అమ్మి రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటికే అమెరికాలో టాప్ టెన్ ఫుడ్ కంపెనీస్‌లో చోటు దక్కించుకుంది. ఓట్స్, వెజిటెబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, గ్లూటెన్ ఫ్రీ, వేగన్, క్వినోవా, బ్రౌన్ రైస్‌తోనూ దోశ పిండి తయారుచేసి బర్గర్లు, పిజ్జాలకు గట్టి పోటీ ఇస్తున్నది.
ప్రపంచమంతా రెండు చిప్స్ చుట్టూ తిరుగుతున్నది. ఒకటి.. కంప్యూటర్ చిప్స్, రెండు ఆలూ చిప్స్! రుచుల రాజ్యంలో చిప్స్ ప్రత్యేకతే వేరు. ప్యాకెట్లకు ప్యాకెట్లు ఖాళీ అయిపోవాల్సిందే. కానీ, ఇక్కడమాత్రం ఆ పప్పులు ఉడకవు. ‘జోలో చిప్’ ఒక్కటి తిన్నా.. జిహ్వ ఎర్రబడిపోతుంది. కండ్లలో నీళ్లు వచ్చేస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న ఫుడ్ చాలెంజ్ ఇదే. పకడ్బందీ ప్యాకింగ్‌తో వచ్చే ఈ సింగిల్ చిప్‌ను తిని నీళ్లు కానీ, చక్కెర, ఐస్‌క్రీమ్ వంటి కారం తగ్గించే పదార్థాలను కానీ తాకకుండా ఎంతసేపు ఉంటారన్నది సవాలు. చాలామందికి రెండంటే రెండు సెకన్లకే ముఖం నోరు, కళ్లు, ముక్కు ఎర్రబారిపోతున్నాయి. ఈ చిప్ ప్యాకెట్ మీద డేంజర్ మార్క్ కనిపిస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రయత్నించకూడదన్న హెచ్చరిక ఉంటుంది. ధర రూ.199. తిన్న తర్వాత కారం, మంట తగ్గించుకోవడానికి అయ్యే ఖర్చు అదనం. ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు, కూల్‌డ్రింక్‌ల లెక్క వేరుగా ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం.
మన హైదరాబాద్‌కు కూడా చిట్టి రోబోలు వచ్చేశాయి. ‘చిట్టి ఇన్ టౌన్’ పేరుతో ప్రారంభమైన ఈ రెస్టారెంట్లో కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకోవడం మొదలు ఫుడ్ సర్వ్ చేయడం, బిల్లు ఇవ్వడం, బయల్దేరుతుంటే ధన్యవాదాలు చెప్పడం వరకు.. అన్నీ రోబోలే చేస్తాయి. కొవిడ్ కారణంగా రెస్టారెంట్లకు దూరమైన జనాలను ఆకర్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రసిధ్ సేతియా, మణికంఠ గౌడ్, మణికంఠ యాదవ్ అనే ముగ్గురు స్నేహితుల వినూత్న ఆలోచనే ఈ రోబో రెస్టారెంట్. ఈ చిట్టి రోబోలు కబుర్లు కూడా చెబుతాయి.