Brain Cells | మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కొత్త నాడీకణాల ఉత్పత్తి ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో కణాల మరణం కూడా కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధన వెల్లడించింది. ఇనుము, ఆక్సిడేటివ్ ఒత్తిడితో సంబంధం ఉన్న ఫెర్రోప్టోసిస్ అనే ప్రత్యేక కణ మరణ ప్రక్రియ మెదడులో సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యాలకు కీలకమైన హిప్పోక్యాంపస్ ప్రాంతంలో కొత్త నాడీకణాల ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రక్రియను న్యూరోజెనెసిస్ అంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ కొత్త కణాల ఉత్పత్తి సహజంగానే తగ్గిపోతుంది. అయితే ఈ తగ్గుదల వెనుక ఫెర్రోప్టోసిస్ కూడా ఒక కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. సెల్ స్టెమ్ సెల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు వయోజన ఎలుకల మెదడును పరిశీలించారు. హిప్పోక్యాంపస్‌లోని న్యూరల్ స్టెమ్ సెల్స్ ఎలా విభజించి, పరిపక్వత సాధించి కొత్త నాడీకణాలుగా మారతాయో అధ్యయనం చేశారు. ఈ కొత్త కణాలు నేర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయని ఇప్పటికే తెలిసిన విషయమే.
అధ్యయనంలో భాగంగా ఫెర్రోప్టోసిస్‌ను అడ్డుకునే సమ్మేళనాలను వృద్ధ ఎలుకలకు అందించారు. దీంతో వాటి మెదడులో కొత్త నాడీకణాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, స్థల అవగాహన, జ్ఞాపకశక్తికి సంబంధించిన పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కనబరిచినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంతకుముందు జరిగిన మరో పరిశోధనలో సెలీనియం సప్లిమెంట్లు వృద్ధ ఎలుకల్లో కొత్త నాడీకణాల ఉత్పత్తిని పెంచి, మేధో సామర్థ్యాలను మెరుగుపరిచినట్లు తేలింది. సెలీనియం జీపీఎక్స్4 అనే ప్రోటీన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ప్రోటీన్ కణాలను ఫెర్రోప్టోసిస్ నుంచి రక్షించే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో సెలీనియం మెదడు కణాలను ఎలా రక్షిస్తుందో అర్థం చేసుకోవడానికి ఫెర్రోప్టోసిస్ ఒక కీలక ఆధారంగా మారిందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం ఫెర్రోప్టోసిస్‌ను కేవలం వ్యాధుల సమయంలో జరిగే హానికర ప్రక్రియగా మాత్రమే చూడలేమని, అది సాధారణ పరిస్థితుల్లో కూడా మెదడులో సమతుల్యతను కాపాడే సహజ వ్యవస్థలో భాగమై ఉంటుందని తెలుస్తోంది.
మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొత్త నాడీకణాల ఉత్పత్తిని అధికంగా పెంచాల్సిన అవసరం ఉండదు. కానీ వృద్ధాప్యం, పక్షవాతం లేదా నాడీక్షీణత సంబంధిత వ్యాధుల కారణంగా ఈ ప్రక్రియలో లోపం ఏర్పడినప్పుడు, ఫెర్రోప్టోసిస్‌ను నియంత్రించే మార్గాలు భవిష్యత్తులో కొత్త చికిత్సలకు దారితీస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. మెదడులో కొన్ని కణాల మరణం కూడా ఆరోగ్యకరమైన పనితీరుకు అవసరమవుతుందని, సరైన సమతుల్యతే మెదడు ఆరోగ్యానికి కీలకమని ఈ అధ్యయనం తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.