Donald Trump : ఇరాన్ (Iran) కు అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో తాము చేసుకోబోయేది కేవలం అవగాహన ఒప్పందమేనని, అది ఫైనల్ కాదని అన్నారు. ఒకవేళ ఒప్పందంలోని అంశాలు తనకు నచ్చకయినా, ఇరాన్ తీరు సరిగ్గా లేకపోయినా ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. జీ7 సదస్సు (G-7 summit) నేపథ్యంలో ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేయనున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అమెరికా- ఇరాన్ ఒప్పందంలో భాగంగా పునర్నిర్మాణ నిధుల కింద టెహ్రాన్‌కు 300 బిలియన్ డాలర్లు సమకూర్చే అంశం ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని ట్రంప్ చెప్పారు. తాము ఒక్క పైసా కూడా వెచ్చించడం లేదన్నారు. తాము పెట్టుబడి పెట్టడం లేదని, తమ దగ్గర అటువంటి ఫండ్ ఏదీ లేదని, ఇరాన్లో పెట్టుబడులు పెట్టాలని గల్ఫ్ దేశాలనూ కోరడం లేదని ట్రంప్ తెలిపారు. ఒకవేళ వారు ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇరాన్ ధోరణి ఎలా ఉంటుందో ఒక అవగాహన వచ్చేవరకు కొంతకాలంపాటు ఆ దేశాలు అటువంటి పని చేయకపోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.