జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి తదితరులు దర్శకత్వం: శ్రీరామ్
కుటుంబ కథలు అనగానే.. కష్టాలు, కన్నీళ్లే కళ్లముందు కదలాడుతాయి. అయితే, వెండితెరపై కామెడీని పండించిన ఫ్యామిలీ స్టోరీలూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవల్ని సరదాగా చూపించాయి. ప్రేక్షకుల మోముపై నవ్వులు పూయించడంతోపాటు ఫ్యామిలీలో సర్దుకుపోవడాలు, కుటుంబ విలువలనూ నేర్పించాయి. ఇలాంటి కుటుంబ నేపథ్యంలో వచ్చిన తెలుగు వెబ్‌సిరీస్.. సేవ్ ద టైగర్స్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లూ ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇటీవలే జియో హాట్‌స్టార్ వేదికగా.. మూడో సీజన్ కూడా విడుదలైంది. రికార్డ్ స్ట్రీమింగ్‌తో దూసుకెళ్తున్నది. కథలోకి వెళ్తే.. మొదటి సీజన్లో మొదలైన గంటా రవి, విక్రమ్, రాహుల్ స్నేహంతోపాటు.. వారి జీవితాల్లో అశాంతి, అసహనం కొనసాగుతూనే ఉంటుంది. ఎమ్మెల్యే కావాలనే ఆశతో ఎన్నికల్లో పోటీచేసి, ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు గంటా రవి (ప్రియదర్శి). భార్య హైమా (జోర్దార్ సుజాత) పోరు పడలేక బస్తీ నుంచి గేటెడ్ కమ్యూనిటీకి మారుతాడు.
ఇక విక్రమ్ (చైతన్య కృష్ణ)కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది భార్య రేఖ (దేవయాని). ఈ కేసు వల్ల అతని ఉద్యోగం పోవడంతోపాటు స్టార్టప్ కంపెనీ కూడా మూతపడుతుంది. మరోవైపు రాహుల్ (అభినవ్ గోమఠం).. భార్య మాధురి (పావని గంగిరెడ్డి) కోరిక మేరకు రైటింగ్ ఆపేసి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరుతాడు. అయితే, నోటి దురుసు వల్ల కొద్ది రోజుల్లోనే ఉద్యోగాన్ని కోల్పోయి, హైదరాబాద్ వచ్చేస్తాడు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ముగ్గురూ ఓరోజు బార్‌కు చేరుకుంటారు. మద్యం మత్తులో మరో ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. అయితే, ఆ కిడ్నాప్ అయినవాళ్లు కూడా వీళ్ల పోలికలతోనే ఉంటారు.
అసలు.. వాళ్లెవరు? ఈ ముగ్గురితో.. ఆ ముగ్గురికి వచ్చిన సమస్యలు ఏంటి? ఇందులో ఇంద్రుడు (వెన్నెల కిషోర్) పాత్ర ఏమిటి? అసలు హీరోయిన్ హంసలేఖతో గంటా రవికి ఉన్న గొడవలు ఏమిటి? గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దామని పోరు పెట్టిన హైమా.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది? విక్రమ్-దేవయాని విడాకులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? రాహుల్‌పై వంద మంది అమ్మాయిలు ఎందుకు కేసులు పెట్టారు? రాహుల్ భార్య మాధురీ.. అబార్షన్ చేయించుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే..‘సేవ్ ద టైగర్స్-3’ కథ.