Spirit | రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో సినిమా చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచారాలు, నిర్మాత చేసినట్లు వైరల్ అయిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో చర్చకు దారితీశాయి. ఇప్పటివరకు ‘స్పిరిట్’ ఒక భారీ ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని, కొరియన్ స్టార్ డాన్ లీ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
అయితే తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ కథ అంతర్జాతీయ మాఫియా నేపథ్యంలో కాకుండా హైదరాబాద్ నేపథ్యంలో సాగే లోకల్ కాప్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. డాన్ లీ నటిస్తున్నారనే ప్రచారంలో కూడా నిజం లేదని నిర్మాత స్పష్టం చేసినట్లు వార్తలు రావడంతో కొందరు అభిమానులు నిరాశకు గురయ్యారు. భారీ స్కేల్లో, ప్రపంచవ్యాప్తంగా సాగే కథను ఊహించిన ప్రేక్షకులకు ఈ కొత్త సమాచారం కొంత షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరోవైపు ‘స్పిరిట్’ను ఊహించినంత భారీ బడ్జెట్‌తో కాకుండా, ఖర్చును నియంత్రిస్తూ రూపొందిస్తున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ సినిమాలకు సాధారణంగా భారీ స్థాయి విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండ్ మేకింగ్ ఉండటంతో ‘స్పిరిట్’ విషయంలోనూ అభిమానులు అదే స్థాయి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
దీంతో కథ పూర్తిగా లోకల్ నేపథ్యంలో ఉండటం, బడ్జెట్ విషయంలో వస్తున్న ప్రచారాలు కలిసి సినిమా హైప్‌పై ప్రభావం చూపాయనే అభిప్రాయం వినిపించింది. అయితే తాజాగా వస్తున్న మరో ప్రచారం ఇప్పుడు ‘స్పిరిట్’పై మళ్లీ ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలోని ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ హైలైట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని స్థాయిలో ఒక భారీ ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్స్ కథను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తాయని, సందీప్ రెడ్డి వంగా మార్క్ షాక్ ఎలిమెంట్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు.అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల వచ్చిన కొన్ని వార్తల కారణంగా సినిమాపై తగ్గిన హైప్‌ను మళ్లీ పెంచేందుకు ఈ క్లైమాక్స్ ప్రచారం జరుగుతోందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కేవలం డ్యామేజ్ కంట్రోల్ ప్రచారమా? లేక నిజంగానే ‘స్పిరిట్’లో భారీ ట్విస్ట్ ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.