Rishi Sunak | బ్రిటన్ ప్రధాని పదవి కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీలో గురువారం రెండో రౌండ్ పోలింగ్‌లోనూ భారత సంతతికి చెందిన రిషి సునాక్ టాప్‌లో ఉన్నారు. రెండో రౌండ్లో రిషి సునాక్ తన బలాన్ని బాగానే పెంచుకున్నారు. బోరిస్ జాన్సన్ వారసుడి ఎన్నిక కోసం జరుగుతున్న రెండో రౌండ్ పోలింగ్‌లో సునాక్ 101 మంది ఎంపీల మద్దతు పొందగలిగారు. తొలి రౌండ్లో 88 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. రెండో రౌండ్లో మరో అభ్యర్థిని తప్పించారు. ఇక రిషి సునాక్‌కు ప్రత్యర్థిగా భావిస్తున్న వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మోర్డౌంట్ 83, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ 64 ఓట్లు పొందారు. అటార్నీ జనరల్ సౌల్లా బ్రేవర్మన్ 27 ఓట్లు రావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని తప్పించారు. మరో ఎంపీ టాం టుగెంధట్ 32, కెమీ బేడ్‌నాక్ 49 ఓట్లు పొందారు. అయితే, బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో ఇద్దరు ప్రత్యర్థులను ఎన్నుకుంటారు. అసలు ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉండటానికి నిర్దిష్టంగా 20 మంది ఎంపీల మద్దతు అవసరం.
తొలి రౌండ్లో పోటీ పడిన ఎంపీల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ప్రధానంగా బ్రిటన్ ప్రధాని పదవి కోసం త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిసి సునాక్‌తోపాటు మోర్డౌంట్, ట్రస్ పోటీ పడనున్నారని తెలుస్తున్నది. ప్రస్తుత ప్రధాని ఎన్నిక షెడ్యూల్ ప్రకారం బోరిస్ జాన్సన్ వారసుడిగా, తదుపరి బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ నేతను సెప్టెంబర్ 5 నాటికి ప్రకటిస్తారని సమాచారం.
బుధవారం తొలి రౌండ్లో రిషి సునాక్‌కు 88 ఓట్లు లభించాయి. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్‌కు సహాయకుడిగా ఉన్న సహాయ వాణిజ్య మంత్రి పెన్నీ మొరౌంట్కు 67, విదేశాంగశాఖ మంత్రిగా పని చేసిన లిజ్ ట్రూస్కు 50 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నధీమ్ జహావి, మాజీ మంత్రి జెరెమీ హంట్లను పోటీ నుంచి తప్పించారు. ఎంపీ కెమీ బేడ్‌నాక్ 40, టామ్ టుగెంధట్ 37, సౌల్లా బ్రేవర్మాన్ 32 ఓట్లు పొందారు.
తదుపరి రౌండ్లలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పిస్తారు. చివరకు అత్యధిక ఓట్లు వచ్చిన ఇద్దరు అభ్యర్థుల్లో తమకు నచ్చిన నేతను కన్జర్వేటివ్ పార్టీ నేతగా.. ప్రధానిగా.. అధికార పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటున్నారు. ఆ ఓట్లలో మెజారిటీ లభించిన వారే బ్రిటన్ ప్రధాని అవుతారు. ఇప్పటికి భారత సంతతి నేత రిషి సునాక్ లీడ్‌లో ఉన్నా.. కన్జర్వేటివ్ పార్టీ పునాది.. తమ నేతను నిర్ణయించనున్నది. దీని ప్రకారం పెన్నీ మౌర్డౌంట్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.