Ram Pothineni | సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్విత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.ఇప్పటికే రజనీకాంత్, రామ్ పోతినేని కలిసి నటిస్తున్నారనే వార్త సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా వీరిద్దరి పాత్రలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
‘ధర్మన్’లో రజనీకాంత్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆయన డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కథలో అసలు ట్విస్ట్ రామ్ పోతినేని పాత్రతోనే ఉంటుందని టాక్. రజనీకాంత్‌కు అల్లుడిగా రామ్ కనిపించనున్నారని, ఆయన పాత్రలో యాంటగోనిస్ట్ షేడ్ ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణ విలన్లా కాకుండా కథకు కీలకంగా ఉండే పాత్రగా రామ్ క్యారెక్టర్‌ను దర్శకుడు డిజైన్ చేసినట్లు సమాచారం.మామా-అల్లుళ్ల మధ్య జరిగే ఈగో క్లాష్ చుట్టూనే కథలోని ప్రధాన సంఘర్షణ సాగుతుందని టాక్. దీంతో రజనీకాంత్, రామ్ పోతినేని మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
ఇప్పటివరకు రామ్ పోతినేని ఎక్కువగా ఎనర్జిటిక్, మాస్ హీరో పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. అయితే ‘ధర్మన్’లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. రజనీకాంత్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రామ్ పాత్రను దర్శకుడు డిజైన్ చేసినట్లు సమాచారం. ఇద్దరు హీరోల మధ్య జరిగే ముఖాముఖి సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా రామ్ పోతినేని పాత్రకు సినిమాలో మూడు ప్రత్యేకమైన ట్రాక్స్ ఉండనున్నాయని సమాచారం. అందులో రజనీకాంత్, రామ్ కలిసి చేసే హై-ఎనర్జీ మాస్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.రజనీకాంత్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌కు రామ్ ఎనర్జీ జత కావడంతో ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనుందని టాక్.‘ధర్మన్’లో సీనియర్ నటి సిమ్రాన్, అందాల భామ రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.