హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన భూముల వేలంలో ఎకరం రూ. 237 కోట్ల రికార్డు ధర పలికింది. ఇక్కడ ఎకరం రూ.139 కోట్లు ధర నిర్ణయించగా.. 70.5 శాతం అధికంగా పలికి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినట్టు టీజీఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ కే శశాంక తెలిపారు. ఈ-ఆక్షన్ ద్వారా భూముల వేలం నిర్వహించినట్టు పేర్కొన్నారు. నిరుడు టీజీఐఐసీ ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.177 కోట్లు పలికినట్టు వివరించారు. హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాయదుర్గం కారిడార్‌లో ఉన్న 6.29 ఎకరాల భూమి వేలంలో జాతీయస్థాయిలో ప్రముఖ కంపెనీలకు చెందిన డెవలపర్లు పాల్గొని పోటీ పడినట్టు తెలిపారు. భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1,490 కోట్లు ఆదాయం సమకూరినట్టు ఆయన వెల్లడించారు.
ఫ్యూచర్‌సిటీలో భూములకు రికార్డు ధరలు పలికాయి. ఈ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఈ-ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు భూములకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం గరిష్ఠంగా రూ.83,500కు అమ్ముడుపోయిందని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంపాట ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ప్లాట్లకు శుక్రవారం ఈ-ఆక్షన్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 1-2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నెం. 2, కుత్బుల్లాపూర్, చింతల్‌లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.