పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులైనా, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులైనా తాము ఎంతచదివినా గుర్తుండటం లేదని వాపోతుంటారు. రోజుకు ఎనిమిది గంటలు పుస్తకం పట్టుకున్నా చదివింది జ్ఞాపకం రావడంలేదంటూ బాధపడుతుంటారు. అలా ఇబ్బందిపడే వారంతా మూసపద్ధతిలో కాకుండా ప్రణాళికాబద్ధంగా చదవడం అలవరచుకోవాలి. ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి, బాగా గుర్తుంచు కోవడానికి రీకాల్ చిట్కాలను పాటించాలి.
బ్లర్డింగ్: ఒక పాఠం బాగా చదివిన వెంటనే పుస్తకాన్ని మూసి, వేరే బుక్‌లో మొత్తం అంశాన్ని వేగంగా రాయండి. దీనివల్ల విషయాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయి.
మీ మాటలో: మీరు చదివిన కంటెంట్‌ను బాగా అర్థం చేసుకోండి. పాఠం తాలూకు భావనను మీ సొంత మాటల్లో బిగ్గరగా చెప్పుకోండి.
ప్రశ్నలుగా: మీరు చదివిన అంశాలను ప్రశ్నలుగా మార్చుకోండి. మీకు మీరే ప్రశ్నించుకోండి. దీంతో మెమోరీ పవర్, రీకాల్ పవర్ పెరుగుతుంది.
ఫ్లాష్ కార్డు: కార్డుకు ఒకవైపు ప్రశ్న, మరోవైపు సమాధానం రాయండి. సమాధానం చూడకుండా ప్రశ్నలకు జవాబులు చెప్పండి. దీని వల్ల మెమోరీ పవర్ పెరుగుతుంది.
ఫెయిన్మన్ టెక్నిక్: మీరు చదివిన అంశాన్ని ఎవరో ఒకరికి వివరించండి. ఒక చిన్న పిల్లాడికి వివరిస్తున్నట్లు బోధించండి.
మైండ్ మ్యాపింగ్: మీరు చదివిన అంశాలకు లింకు ఉన్న ప్రతి టాపిక్‌ను ఆ పక్కన రాసి వాటిని కూడా మరోసారి చదవండి. రెండింటికీ లింక్స్ సరిగా ఉండేలా చూడండి. దీంతో రీకాల్ పవర్ పెరుగుతుంది
ప్రాక్టీస్ పేపర్లు: గత ప్రశ్నాపత్రాలను, ప్రాక్టీస్ బిట్స్‌ను ప్రతిరోజూ సాధన చేయండి. దీనివల్ల మెదడులోని సమాచారాన్ని త్వరగా రీకాల్ చేయవచ్చు. మీరు చదివిన అంశాల సారాంశాన్ని పుస్తకంలో రాసి చూడకుండా చెప్పండి. దీని వల్ల మెదడు రీకాల్ సామర్థ్యం పెరుగుతుంది. వీటన్నిటితో పాటు రోజుకు ఎనిమిది గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీంతో మీరు చదివిన విషయాలను మెదడు పద్ధతి ప్రకారం జ్ఞాపకం ఉంచుకుంటుంది.