వరాహ పురాణం! పంది గుండె మనిషికి

సృష్టిలో మానవ జన్మ ఉన్నతమైనదని అంటారు. మనిషికి కీలకమైన అవయవాలు.. గుండె, మెదడు, వెన్నుపాము. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా అచేతనుడు అవుతాడు. కాబట్టి చికిత్సతోనో, శస్త్ర చికిత్సతోనో, అవసరమైతే అవయవ మార్పిడి ద్వారానో అతడిని బతికించుకోవాలి. కాబట్టే, గుండె విఫలమైన రోగికి మరో జీవి గుండెను అమర్చే దిశగా అడుగులు వేస్తున్నది వైద్య ప్రపంచం. ఆ ప్రయత్నంలో అనేక ప్రయోగాలు జరిగాయి. మనిషి జన్యు క్రమానికి దగ్గరగా ఉండే గిబ్బన్ జాతి కోతుల గుండెను అమర్చి చూశారు. కానీ, ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. దాంతో, మనిషి గుండె పరిమాణానికి దగ్గరగా ఉండే పంది గుండెపై దృష్టిపెట్టారు.
పంది గుండెను మనుషులకు అమర్చడంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. పంది కణజాలాల్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. గ్రహీత శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వాటిని పరాయివిగా గుర్తిస్తుంది. నిరసన పూర్వకంగా దాడిచేసి తిరస్కరిస్తుంది. ఈ తిరుగుబాటు కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది. వెంటనే ఉండొచ్చు. లేదంటే కొంతకాలం పట్టొచ్చు. జన్యు మార్పిడి సాంకేతికతను ఉపయోగించుకొని, ఈ తిరస్కరణలకు కారణమయ్యే పదార్థాలను పూర్తిగా తొలగించడమో, లేదంటే పంది కణజాలంలోనే ఒదిగి ఉండేలా చేయడమో అసాధ్యమేం కాదు. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని రకాలైన ఔషధ ప్రయోగాలను (మెడికేషన్స్) అభివృద్ధి చేశారు కూడా. కొన్నిటికి వైద్యపరమైన వాడకం కోసం ఆమోదం లభించింది. చాలా వరకు ప్రయోగ దశలోనే ఉన్నాయి.
2022 జనవరి 7. ప్రపంచ వైద్య రంగంలో చారిత్రకమైన రోజు. 57 ఏండ్ల డేవిడ్ బెనెట్‌కు వైద్యులు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. జన్యు మార్పిడి చేసిన పంది గుండెను తన శరీర వ్యవస్థలో భాగం చేసుకున్న బెనెట్ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ అనే నిపుణుడు నిర్వహించారు. ఈ ప్రయోగం.. అమెరికాలోని మేరీలాండ్ మెడికల్ సెంటర్ శస్త్రచికిత్స విభాగ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్టీన్ లా సమక్షంలో జరిగింది. మార్పిడి విజయవంతంగా జరిగినా, ఆ గుండె సాయంతో బెనెట్ ఎంతకాలం జీవిస్తాడన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. శస్త్రచికిత్సకు ముందు బెనెట్ గుండె పూర్తిగా దెబ్బతిన్నది. దాదాపుగా మంచానికే పరిమితం అయ్యాడు. ఆరు వారాలపాటు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అండతో కాలం వెళ్లదీశాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, అతను బతకడని అర్థమైపోయింది. అయినా ఓ ప్రయత్నమంటూ చేయాలనే ఉద్దేశంతో, గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. బెనెట్‌కు అమర్చిన పంది గుండెను రెవివోకర్ అనే జన్యు మార్పిడి అవయవాల తయారీ సంస్థ అందించింది. మొట్టమొదటి క్లోనింగ్ గొర్రె డాలీకి ప్రాణంపోసిన ఘనత ఈ సంస్థదే.
అవయవాల కొరతకు పరిష్కారం
బెనెట్‌కు పంది గుండె అమర్చడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక గుండె మార్పిడికి ఎంచుకున్న పంది దాదాపు 10 రకాలైన జన్యుపరమైన మార్పిడులకు గురైంది. అంతేకాకుండా, మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) చేస్తున్న అవయవాన్ని తిరస్కరించకుండా ఉండటానికి బెనెట్ శరీరంలోకి ప్రయోగాత్మకంగా ఒక ఔషధాన్ని ఎక్కించారు. నిజానికి, ఏండ్ల తరబడి దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. మొదట పందుల అవయవాలను బబూన్ జాతి కోతుల్లోకి మార్పిడి చేశారు. బ్రెయిన్ డెడ్ మనుషులకు అమర్చి చూశారు. ఆ ప్రతిస్పందనలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఆ ఫలితాల తర్వాతే జన్యుపరమైన, వైద్యపరమైన మార్పు చేర్పులకు వెళ్లారు. అవయవాల వైఫల్యం వల్ల సంభవిస్తున్న మరణాలకు అడ్డుకట్ట వేయాలంటే, ఆయా అవయవాల కొరతను అధిగమించాలి. ఈ దిశగా తాజాగా జరిగిన పంది గుండె మార్పిడిని గొప్ప విజయంగా పరిగణిస్తున్నారు. కాకపోతే, మనుషులకు జంతువుల గుండెలు లేదా అవయవాలను అమర్చడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. మనుషుల శరీరంలోకి జంతువుల కణజాలాన్ని ఎక్కించే ప్రక్రియను ‘జెనోట్రాన్స్ప్లాంటేషన్’ అంటారు.
పాతికేండ్ల కిందటే…
వాస్తవానికి, కృత్రిమ గుండె కవాటాలను తయారుచేయడానికి పంది గుండె కవాటాలను (వాల్వులు) ఉపయోగిస్తారు. అలా అభివృద్ధి చేసిన కవాటాలను మనిషి గుండె కవాటాల స్థానంలో అమరుస్తారు. ఆ తరహా ప్రయత్నాలు చాలా వరకూ విజయవంతం అయ్యాయి. ఇకపోతే, భారత్‌లో కూడా 25 ఏండ్ల కిందే పంది గుండెను మనిషికి అమర్చిన ఉదాహరణ ఒకటి కనిపిస్తున్నది. అస్సాంకు చెందిన గుండె సంబంధ వ్యాధుల నిపుణుడు డాక్టర్ ధనీరామ్ బారువా, హాంకాంగ్ సర్జన్ డాక్టర్ జొనాథన్ హో కీ- షింగ్తో కలిసి తీవ్ర అనారోగ్యంతో ఉన్న పూర్ణో సైకియా అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు. 1997 జనవరిలో అస్సాం రాజధాని గువాహటికి దగ్గర్లోని ‘హార్ట్ సిటీ’లో ఈ మార్పిడి జరిగింది. కాగా, రోగి ఏడు రోజులు మాత్రమే బతికాడు. ట్రాన్స్‌ప్లాంటేషన్ చట్టం కింద అనుమతులు తీసుకోకపోవడంతో డాక్టర్ ధనీరామ్‌ను అరెస్టు చేశారు. అల్లరి మూకల దాడిలో అతని హాస్పిటల్ ధ్వంసమైపోయింది.
సాంస్కృతిక అవరోధాలు
మనిషికి అమర్చడానికి అనువుగా మార్చాలంటే.. పంది గుండెకు దాదాపు 10 రకాల జన్యుపరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. పంది పుట్టగానే దానినుంచి గుండెను వేరుచేయాలి. ఆపైన క్రిమిరహిత వాతావరణంలో వృద్ధి చేయాలి. అందులోనూ, పందుల నుంచి అమర్చే అవయవాలు మనుషుల్ని అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్లకు గురిచేస్తాయి. వీటిలో కొన్ని వైరల్ మూలాలు పందుల్లో జన్యుపరంగానే ఉంటాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పంది నాలుగు కాళ్ల జీవి. అడ్డంగా ఉంటుంది. నిటారుగా ఉండే మనిషి శరీరానికి రక్తం సరఫరా చేయడానికి తయారైంది కాదు. కానీ, మనిషి శరీరంలోకి వచ్చేసరికి తన సహజ స్వభావానికి విరుద్ధంగా పనిచేయాలి. అంతేకాదు, సాంస్కృతిక పరమైన ఆక్షేపణలూ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని మతాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. జంతు హక్కుల ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అవయవాల మార్పిడి విషయంలో మన ముందున్న దారేది? అంటే… జన్యు ఇంజినీరింగ్, మూలకణ పరిశోధన, పూర్తి కృత్రిమ హృదయ నిర్మాణం, రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) మార్చే కొత్త ఔషధ ప్రయోగాలు, పందులు, ఇతర జంతువుల పిండాలలో మనుషుల అవయవాలను అభివృద్ధి చేయడం, అవయవాల 3డీ ప్రింటింగ్.. ఇంకా మరెన్నో సాంకేతికతలు పోటీలో ముందువరసలో నిల్చున్నాయి. అన్నిటికీ మించి.. మనకు ప్రకృతి ఇప్పటికే చాలా ఇచ్చింది. ఆ విషయాన్ని ఎప్పుడూ మరవకూడదు. మన శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీదే ఉంది.
పంది గుండెనే ఎందుకు?
17వ శతాబ్దంలో గొర్రె రక్తం ఎక్కించడం మొదలుకొని, అగ్ని ప్రమాద రోగులకు జంతుచర్మం అతికించడం, బబూన్ జాతి కోతుల గుండెలు, మూత్రపిండాలు, కాలేయాలు… ఇలా అన్ని అవయవాలనూ మనుషులకు అమర్చడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జన్యుపరంగా మనిషికి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రాణి గిబ్బన్. దాని గుండెను కూడా మనిషికి అమర్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. గిబ్బన్ గుండె పరిమాణం చాలా చిన్నది. ఇన్ఫెక్షన్లు సోకే ఆస్కారమూ ఎక్కువే. దీంతో స్వీకర్తల శరీర వ్యవస్థ తిరస్కరించింది. దీనికితోడు, నైతికపరమైన సందేహాలూ తలెత్తాయి. మరోవైపు, పందుల గుండెలు దాదాపుగా మనిషి గుండెను పోలి ఉంటాయి. వాటిని ప్రయోగశాలలో తయారు చేయడం, మనిషికి అమర్చడం చాలా సులువు. దాంతో పంది గుండె వైపే మొగ్గు చూపారు శాస్త్రవేత్తలు.
-డాక్టర్ అమరేశ్ రావు మాలెంపాటి
యూనిట్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సర్జరీ
నిజామ్స్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)
హైదరాబాద్.
సెల్: 98492 57716
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

