Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ వసూళ్ల పరంగా కూడా సత్తా చాటుతోంది. మొదటి వారం తర్వాత వీక్‌డేస్‌లో కొంత మందగించిన కలెక్షన్లు, రెండో వీకెండ్లో మళ్లీ ఊపందుకోవడం విశేషం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, విడుదలైన 11వ రోజు ఆదివారం ‘పెద్ది’ మరోసారి బలమైన ప్రదర్శన కనబరిచింది. దేశవ్యాప్తంగా సుమారు 4,133 షోల ద్వారా రూ.9.20 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. దీంతో భారతీయ బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లో ఈ చిత్రం రూ.216 కోట్ల నెట్, రూ.256.23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘పెద్ది’ మంచి స్పందనను అందుకుంటోంది. విదేశీ మార్కెట్లలో ఇప్పటివరకు సుమారు రూ.51.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.307.98 కోట్ల గ్రాస్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం. మరోవైపు చిత్ర బృందం మాత్రం మొత్తం వసూళ్లు రూ.393 కోట్లకు చేరుకున్నాయని ప్రకటించింది.తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.195.30 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు సమాచారం. ఇది సినిమా విజయానికి కీలకంగా మారిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా ‘పెద్ది’ తన ముద్ర వేస్తోంది. కర్ణాటకలో రూ.27.58 కోట్ల గ్రాస్, తమిళనాడులో రూ.6.05 కోట్ల గ్రాస్, కేరళలో రూ.72 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.26.58 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.షేర్ కలెక్షన్ల పరంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో కలిపి ‘పెద్ది’ రూ.147.04 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో నిజాం ప్రాంతం ముందంజలో ఉండి రూ.55.81 కోట్ల షేర్ అందించగా, ఉత్తరాంధ్ర రూ.22.07 కోట్లు, సీడెడ్ రూ.20.26 కోట్లు వసూలు చేశాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే ఈస్ట్ గోదావరి నుంచి రూ.12.30 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి రూ.8.78 కోట్లు, గుంటూరు నుంచి రూ.11.82 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి రూ.9.90 కోట్లు, నెల్లూరు నుంచి రూ.6.10 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. రెండో వీకెండ్లో కలెక్షన్లు మళ్లీ జోరందుకోవడంతో ‘పెద్ది’ మరిన్ని రికార్డుల దిశగా పయనిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ ముగిసే నాటికి రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.