మధుమేహం ఉన్నా గుర్తించట్లే!
మన దేశంలో 3.86 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ, ఆ విషయాన్ని గుర్తించడం లేదు.
- దేశంలో డయాబెటిస్ బాధితులమని తెలియనివారు ఏకంగా 3.86 కోట్ల మంది
- వైద్యపరీక్షలు చేయించుకోని 43 శాతం మంది ప్రజలు
- అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశంలో 3.86 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ, ఆ విషయాన్ని గుర్తించడం లేదు. అంటే, ఈ వ్యాధితో బాధపడుతున్న 8.98 కోట్ల మందిలో 43 శాతం మంది వైద్య పరీక్షలు చేయించుకోకుండా గడుపుతున్నారు. ఈ నెల 14న మధుమేహ దినం సందర్భంగా అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్) విడుదల చేసిన తాజా సర్వే ఈ వివరాలను వెల్లడించింది. మన దేశంలో టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నవారి వివరాలను విశ్లేషించినపుడు, ఈ వ్యాధి వల్ల జరిగే ముప్పును చాలా మంది తక్కువగా అంచనా వేస్తున్నట్లు తెలిసింది.
పరీక్షలను ఎలా చేయించుకోవాలో వీరికి తెలియడం లేదు. భారత్, బ్రెజిల్, కెన్యా, సౌదీ అరేబియా, స్పెయిన్, అమెరికాలలో ఈ సర్వేను నిర్వహించారు. మన దేశం నుంచి 502 మంది పాల్గొన్నారు. వీరు 25-64 ఏండ్ల మధ్య వయస్కులు. డయాబెటిస్ రిస్క్ చెక్ చేయించుకోవడం అవసరమేనని 84 శాతం మంది అంగీకరించగా, తమకు టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని 14 శాతం మంది మాత్రమే నమ్ముతున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి ఒక్కరూ ముప్పునకు సంబంధించిన కనీసం రెండు లక్షణాలను చెప్పారు.
ప్రీ-డయాబెటిస్‌పై అపోహలు..
మధుమేహానికి ముందు దశ అయిన ప్రీ-డయాబెటిస్‌పై ప్రజల్లో అపోహలు ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ దశలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, మధుమేహం నిర్ధారణ అయ్యేంత స్థాయికి చేరవు. ఈ ఆరు దేశాల నుంచి పాల్గొన్న వారిలో 75 శాతం మంది ప్రీ-డయాబెటిస్ ఉన్న వారిలో గమనించదగిన లక్షణాలు పైకి స్పష్టంగా కనిపిస్తాయని నమ్ముతున్నారు.
ఇది చాలా తప్పుడు భావన. డయాబెటిస్ రిస్క్ చెక్ కోసం ఏర్పాట్లు చేసుకునే ఆత్మవిశ్వాసం లేదని 48 శాతం మంది చెప్పగా, చెక్ చేయించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయోనని భయపడుతున్నామని 35 శాతం మంది తెలిపారు. తమకు మధుమేహం ముప్పు లేదని 25 శాతం మంది భావిస్తున్నారు.
భయాందోళనలు తొలగించాలి..
ఐడీఎఫ్ ఆగ్నేయాసియా ప్రాంత చీఫ్ డాక్టర్ బన్షి సబూ మాట్లాడుతూ, ప్రజలే ముందుకు వచ్చి మధుమేహ పరీక్షలు చేయించుకునే వరకు భారతదేశం ఎదురు చూడకూడదని చెప్పారు. మధుమేహం ప్రమాదం ఉన్నవారు పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావాలంటే, భయాందోళనలను తొలగించాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఐడీఎఫ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీటర్ స్కార్జ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది తమకు మధుమేహం ఉన్న విషయం తెలియకుండానే జీవిస్తున్నారన్నారు. వ్యాధిపై అవగాహన ఉండటానికి, వ్యక్తిగతంగా తమకు ఉన్న ప్రమాదాన్ని గుర్తించడానికి మధ్య వ్యత్యాసం ఉందన్నారు.
నెమ్మదిగా …
టైప్-2 మధుమేహం లక్షణాలు చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. కొన్నేండ్లపాటు కొనసాగినా, వాటి తీవ్రత తక్కువగా ఉండటంతో చాలా మంది ఆ విషయాన్ని గుర్తించలేకపోవచ్చు. అందుకే వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఐడీఎఫ్ డయాబెటిస్ అట్లాస్ 11వ ఎడిషన్ ఆధారంగా రూపొందించిన గణాంకాల ప్రకారం, మన దేశంలో మధుమేహం ఉన్న వయోజనుల్లో ప్రస్తుతం 57 శాతం మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది.
దీనిని 2030 నాటికి 80 శాతానికి పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశంలో మరో 2.07 కోట్ల మందికి మధుమేహాన్ని నిర్ధారించాలి. అంటే 2030 చివరి వరకు రోజుకు సుమారు 13,700 మందికి వ్యాధి నిర్ధారణ జరగాల్సి ఉంటుంది. దేశంలో మధుమేహ వైద్య ఖర్చులు 2024లో 980 కోట్ల డాలర్లకు చేరాయి. గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, కాళ్లను తొలగించవలసి రావడం వంటి సమస్యలకు చికిత్స చేయడానికి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

