పిల్లలకు ఏం పెట్టాలనే విషయంలో కన్నవారికి ఎప్పుడూ గందర గోళమే. చిన్నారుల ఆహారంలో వాల్నట్స్ చేరిస్తే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి పిల్లల శరీరం, మెదడుకు కావాల్సినంత శక్తిని సమకూరుస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలం. దీంతో పిల్లలు చురుగ్గా, బలంగా, సంతోషంగా ఉంటారు. మిగిలినవారితో పోలిస్తే.. వారంలో కనీసం మూడుసార్లు వాల్నట్స్ తిన్న పిల్లల జ్ఞాపకశక్తి, జాగరూకత పెరిగాయని ‘ఇ-క్లినికల్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.
వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ (ఏఎల్ఏ) అనే ఒకరకం ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు కౌమారదశలో ఉన్నప్పుడు ఆ అవసరం మరీ ఎక్కువ. ఈ సమయంలో పిల్లల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అయితే, పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలనే విషయంలో డాక్టర్ల సలహా తప్పనిసరి. వాల్నట్స్ అలర్జీ లేకపోతే మాత్రం పిల్లలకు ఇదో సూపర్‌ఫుడ్.
గర్భిణులు కుంగుబాటుకు గురైతే.. ఆ ఒత్తిడంతా పుట్టబోయే పిల్లలకు బదిలీ అవుతుందట. దీనికి సంబంధించి బెంగళూరు చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ స్టడీ ఓ పరిశోధన నిర్వహించింది. 2016లో మొదలైన ఈ అధ్యయనం తాజాగా ముగిసింది. బెంగళూరులోని వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో పేర్లు నమోదు చేసుకున్న 912 మంది గర్భిణులపై ఈ పరీక్షలు జరిపారు.
కుంగుబాటు ఉన్న గర్భిణులకు పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారట. గృహహింస, పరోక్ష ధూమపానం కూడా గర్భిణులు, పిల్లల మీద దుష్ప్రభావం చూపుతాయట. వీటివల్ల ముందస్తు ప్రసవాలు, పిల్లల్లో ప్రవర్తన సమస్యలు తలెత్తుతాయట. ప్రసవానికి ముందు, ఆ తర్వాత కూడా ఇంటి వాతావరణం గర్భిణుల మీద ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం తెలిపింది. కాబోయే తల్లికి ఇంటా బయటా స్నేహపూర్వక వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనదే.
స్ప్రింటింగ్, రోయింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాల వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట. టెల్ అవీవ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వ్యాయామంతో మన శరీర అవయవాలు మరింత గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. కణాల్లో శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్ అనే విషయం తెలిసిందే. దీంతో వ్యాయామం చేసేవాళ్లలో వ్యాధి వృద్ధి చెందుతున్న దశలో క్యాన్సర్ కణాలు వ్యాపించడానికి అవసరమైన గ్లూకోజ్ అందు
బాటులో ఉండదు. అంటే… క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశం తక్కువన్నమాట.