ఆదిబట్ల, జూన్ 15 : నాదర్గుల్ రైతుల న్యాయపోరాటం కొనసాగుతూనే ఉన్నది. కాస్బాగ్ భూముల సమస్యను పరిష్కరించాలని 82రోజులుగా వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసనలు, వంటావార్పు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. చలో కలెక్టరేట్ పేరుతో సుమారు 14కిలోమీటర్ల మేర నడుచుకుంటూ నాదర్గుల్ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేశారు.
రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలతో హోరెత్తించారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఈ పాదయాత్రను రైతుల గోసయాత్రగా నిర్వహించినట్టు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.