పారిశ్రామికవేత్తలపై ఆగ్రహమా?
దేశంలో ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉద్యోగులకు వేతనాలు ఎందుకు పెంచడం లేదు? దేశీయ ఉత్పత్తుల నాణ్యత ఎందుకు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడం లేదు? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్తలపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉన్నది.
దేశంలో ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉద్యోగులకు వేతనాలు ఎందుకు పెంచడం లేదు? దేశీయ ఉత్పత్తుల నాణ్యత ఎందుకు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడం లేదు? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్తలపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉన్నది. ఇటీవల ఫిక్కీ శతాబ్ది వార్షిక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గమనిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలోని సమస్యలన్నింటికీ పారిశ్రామికవేత్తలే కారణమన్నట్లుగా ఉన్నది. కార్పొరేట్ పన్నును తగ్గించాం, పన్ను మినహాయింపులు ఇచ్చాం, అయినా ఉద్యోగాలు, వేతనాలు ఎందుకు పెరగడం లేదని మోదీ ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు తమ సామాజిక బాధ్యతను విస్మరించకూడదనడంలో సందేహం లేదు. కానీ పన్నెండేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న ప్రధాని తన ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎందుకు సమీక్షించుకోవడం లేదు? 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలతో దేశీయ తయారీ రంగంలో విప్లవం తీసుకొస్తామని ప్రకటించింది. కానీ నేడు యువతను నిరుద్యోగం వెంటాడుతోంది. ఉన్నత విద్యావంతులకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు.
ఉద్యోగం దొరికినా చాలామందికి భద్రత, స్థిరత్వం, గౌరవప్రదమైన వేతనాలు లేవు. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం 2017-18 నుంచి 2023-24 మధ్య ధరల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు క్రమబద్ధమైన వేతన ఉద్యోగాల్లో పురుషుల వాస్తవ ఆదాయం 6.4 శాతం, మహిళల ఆదాయం 12.5 శాతం తగ్గింది. ఇది ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనం కాదా? మరోవైపు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ అమలు, కొవిడ్ సంక్షోభాలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిశ్రమలకు అవసరమైన చౌక రుణాలు, స్థిరమైన విధానాలు, కొనుగోలు శక్తి కలిగిన మార్కెట్ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజల ఆదాయాలు పెరగకుండా ఉత్పత్తులకు డిమాండ్ ఎలా పెరుగుతుంది? పరిశ్రమలు పెట్టుబడులు ఎలా పెడతాయి?
ఇంకోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో విక్రయించడం, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులను ప్రైవేటు చేతుల్లో పెట్టడం మోదీ ప్రభుత్వ విధానంగా మారింది. ఎయిర్ ఇండియా విక్రయం, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాల తగ్గింపు, రైల్వేలు, బొగ్గు, విద్యుత్తు వంటి రంగాల్లో ప్రైవేటు ఆధిపత్యానికి ప్రోత్సాహం ఇందుకు ఉదాహరణలు. ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలను కుదిస్తూ ప్రైవేటు రంగాన్ని ఉద్యోగాలు కల్పించాలని ఉపదేశించడం ద్వంద్వవైఖరి కాదా? ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం గురించి కూడా ప్రశ్నించాలి. అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాల విస్తరణకు కీలక రంగాల్లో లభిస్తున్న అవకాశాలు, ప్రభుత్వ ఆస్తుల కేటాయింపులపై అనేక విమర్శలు ఉన్నాయి. చిన్న పరిశ్రమలు రుణాల కోసం అల్లాడుతుంటే, కీలక ఆర్థిక ఆస్తులు కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన పోటీ ఎలా సాధ్యం?
మోదీ తన ఆగ్రహం ద్వారా ఒకరకంగా తన ప్రభుత్వ వైఫల్యాలనే ఒప్పుకున్నట్టు అయ్యింది. ఉద్యోగాలూ, ఆదాయాలూ పెరగలేదని ఆయన మాటలు ఘంటాపథంగా తెలియజేస్తున్నాయి. వీటి వెనుక ఉన్నది విధానపరమైన వైఫల్యాలే తప్ప మరోటి కాదు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులను ప్రైవేటు చేతుల్లో పెట్టడం, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాల విస్తరణకు అనుకూల వాతావరణం కల్పించడం, చిన్న పరిశ్రమలను సంక్షోభంలోకి నెట్టడం.. ఇవన్నీ ఒకే ఆర్థిక విధానంలోని భిన్న పార్శ్వాలు. ఆ విధానాల ఫలితంగానే ఉద్యోగాలు క్షీణిస్తున్నాయి, వేతనాలు స్తంభిస్తున్నాయి, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నది. ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా పారిశ్రామికవేత్తలపై ఆగ్రహం ప్రదర్శించడం ద్వారా మోదీ తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. పారిశ్రామికవేత్తలు లాభాల కోసం కార్మికుల శ్రమను దోచుకోకుండా, న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాల్సిందే. అదే సమయంలో ప్రభుత్వం తన బాధ్యత సమర్థంగా నిర్వహించాలి. దేశ యువతకు కావాల్సింది ఉపన్యాసాలు కాదు.. ఉద్యోగాలు. కార్మికులకు కావాల్సింది హితబోధలు కాదు.. గౌరవప్రదమైన వేతనాలు. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ, కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని పెంచుతూ వచ్చిన మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలకు పారిశ్రామికవేత్తలను బాధ్యులను చేయాలని చూడటం అర్థరహితం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

