అర్లింగ్టన్ (యూఎస్ఏ) : ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా హ్యాట్రిక్ కొట్టింది. సారథి లియోనల్ మెస్సీ మ్యాజిక్‌తో జోరుమీదున్న ఆ జట్టు.. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో 3-1తో జోర్డాన్‌ను ఓడించి గ్రూప్ దశను గెలుపుతో ముగించింది. వరుసగా రెండు విజయాలతో ఇదివరకే రౌండ్ ఆఫ్ -32కు అర్హత సాధించిన నేపథ్యంలో మెస్సీతో పాటు 9 మంది ఆటగాళ్లను బెంచ్ మీద ఉంచిన ఆ జట్టు.. రెండో అర్ధ భాగంలో కెప్టెన్‌ను బరిలోకి దించి అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్‌లో సుమారు 70 శాతం బంతిని తమ అధీనంలో ఉంచుకున్న వరల్డ్ చాంపియన్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై వరుసగా దాడులకు దిగి ఫలితాన్ని రాబట్టారు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న జియోవని లొ సెల్సొ 19వ నిమిషంలోనే డైరెక్ట్ ఫ్రీ కిక్‌తో తొలి గోల్‌ను అందించాడు. 31వ ని.లో లౌటారొ మార్టినెజ్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి తన జట్టు 2-0 ఆధిక్యానికి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్ ముగిశాక జోర్డాన్ సైతం ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. ముసా అల్టామర్ (55వ ని.) గోల్ కొట్టి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. కానీ 60వ నిమిషంలో ప్రేక్షకుల హర్షద్వానాల నడుమ ఫీల్డ్‌లోకి వచ్చిన మెస్సీ.. మరోసారి మ్యాజిక్ చేశాడు. 80వ ని.లో ఫ్రీ కిక్‌ను తన ట్రేడ్‌మార్క్ షాట్‌తో గోల్ కొట్టాడు. ఈ మెగా టోర్నీలో మెస్సీకి ఇది ఆరో గోల్ కాగా మొత్తంగా వరల్డ్‌కప్‌లో 19వది కావడం విశేషం. అదీగాక ప్రపంచకప్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లోనూ గోల్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు.
ఈసారి 48 జట్లతో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఆఫ్రికా దేశాలు సత్తాచాటుతున్నాయి. రికార్డుస్థాయిలో 10 ఆఫ్రికా జట్లు టోర్నీలో పాల్గొనగా అందులో ఏకంగా 9 జట్లు రౌండ్ ఆఫ్-32కు చేరడం గమనార్హం. వరల్డ్‌కప్ నాకౌట్ దశకు ఇన్ని ఆఫ్రికా దేశాలు అర్హత సాధించడం చరిత్రలో ఇదే మొదటిసారి. 2014లో అల్జీరియా, నైజీరియా నాకౌట్ చేరడమే ఇప్పటివరకు అత్యుత్తమం. 17 రోజుల పాటు సాగిన గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో యూరప్‌నకు చెందిన అగ్రశ్రేణి జట్లకు షాకులిస్తూ దక్షిణాఫ్రికా, ఐవరీ కోస్ట్, మొరాకో, సెనెగల్, ఘనా, ఈజిప్ట్, కాంగో, అల్జీరియాతో పాటు ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతూ జనాభాపరంగా 5 లక్షలు కూడా లేని కాబో వెర్డె సైతం నాకౌట్ చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మెగా టోర్నీకి అర్హత సాధించి నాకౌట్‌కు చేరని ఏకైక ఆఫ్రికా జట్టు ట్యూనిషియా మాత్రమే.
సుమారు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ సాకర్ ప్రపంచకప్ బరిలోకి దిగిన కాంగో.. తొలి ప్రయత్నంలోనే నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-కేలో కాంగో.. 3-1తో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుచేసి నాకౌట్ సమరానికి సిద్ధమైంది. మ్యాచ్ ప్రారంభమైన పదో నిమిషంలోనే స్టార్ ఫార్వర్డ్ ఎల్డర్ షొమురొదొవ్ గోల్ చేయగా ఫస్టాఫ్‌లో కాంగోకు నిరాశే ఎదురైంది. కానీ బ్రేక్ తర్వాత ఆ జట్టు రెచ్చిపోయింది. యోన్ విస్సా (68వ, 90+1వ) డబుల్ ధమాకాకు తోడు ఫిస్టన్ మయెలె (78వ) గోల్స్‌తో ఆఫ్రికన్ దేశం తిరుగులేని స్థితిలో నిలిచింది.

గ్రూప్-జేలో భాగంగా ఆస్ట్రియా, అల్జీరియా మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. ఆట చివరి నిమిషం వరకూ హోరాహోరీగా సాగిన పోరులో అల్జీరియా తరఫున రఫిక్ బెల్ఘలి (45వ ని.) ఒక గోల్ చేయగా రియాద్ మహెర్జ్ (60, 90+3వ) రెండు గోల్స్ సాధించాడు. అల్జీరియా నుంచి మార్కో ఆర్నోటోవిచ్ (28వ), సబిట్జర్ (55వ)తో పాటు ఆట ముగుస్తుందనగా సాశా కళాజ్దిచ్ (90+6వ) తలతో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి మ్యాచ్ డ్రాగా ముగియడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ డ్రాగా తేలడంతో ఇరాన్ నాకౌట్ ఆశలు అడియాసలయ్యాయి.
వరల్డ్‌కప్ గ్రూప్ దశను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఇంగ్లండ్ అగ్రస్థానంతో ముగించింది. గ్రూప్-ఎల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 2-0తో పనామాను ఓడించి 7 పాయింట్లతో గ్రూప్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆట ఫస్టాఫ్‌లో గోల్ సాధించడలోంలో విఫలమైన ఆ జట్టుకు రెండో అర్ధభాగంలో బెల్లింగ్హమ్ (62వ ని.), హ్యారీ కేన్ (67వ ని.) ఐదు నిమిషాల వ్యవధిలోనే తలా ఓ గోల్ చేసి ‘త్రీ లయన్స్’ను తిరుగులేని స్థితిలో నిలిపారు.

ప్రపంచకప్‌లో కేన్‌కు ఇది 11వ గోల్ కావడం విశేషం. తద్వారా అతడు గ్యారీ లైంకర్ (10) రికార్డును అధిగమించాడు. ఇక ఇదే గ్రూప్‌లో ఉన్న క్రొయేషియా.. 2-1తో ఘనాను ఓడించింది. పీటర్ సూచిక్ (31వ ని.), నికోలా వ్లాసిక్ (83వ ని.) గోల్స్ కొట్టగా డెరిక్ లుకాసెన్ (73వ ని.) ఘనా తరఫున గోల్ చేసి క్రొయేషియా ఆధిక్యాన్ని తగ్గించాడు. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, క్రొయేషియా, ఘనా నాకౌట్‌కు అర్హత సాధించాయి.
క్రిస్టియానో రొనాల్డోతో పాటు పోర్చుగల్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. గ్రూప్-కేలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పోర్చుగల్.. కొలంబియాతో జరిగిన పోరును గోల్స్ లేకుండానే డ్రాతో ముగించింది. మియామి స్టేడియంలో జరిగిన పోరులో ఇరుజట్లూ గోల్ కోసం యత్నించినా సఫలం కాలేకపోయాయి. రౌండ్ ఆఫ్-32లో కొలంబియా.. ఘనాతో తలపడనుండగా పోర్చుగల్ జట్టు క్రొయేషియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
అర్జెంటీనా, జోర్డాన్ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో గ్రూప్ దశకు తెరపడింది. సౌతాఫ్రికా-కెనడా మధ్య జరిగే మ్యాచ్‌తో రౌండ్ ఆఫ్ -32 మొదలవనుంది. 16 మ్యాచ్లుండే ఈ దశ జూన్ 29 నుంచి జూల్ 4 దాకా సాగుతుంది. ఈ దశలో ఓడిన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. వచ్చేనెల 4న అర్జెంటీనా.. కాబో వెర్డెతో తలపడనుంది.
బ్రెజిల్ x జపాన్ రా. 10.30 నుంచి
జర్మనీ x పరాగ్వే అ.రా. 2.00 నుంచి