హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగమనేది ఏండ్ల కల.. అనేక నిద్రలేని రాత్రులకు ప్రతిఫలం. సర్కార్ కొలువు లక్ష్యంగా ఎందరో నిరుద్యోగులు కుస్తీపడుతుంటారు. కొందరు అభ్యర్థుల ఆశలపై కటాఫ్ తేదీ నిబంధన నీళ్లు చల్లుతున్నది. ముఖ్యంగా డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్‌లోని విద్యార్థుల కలను కటాఫ్ తేదీ నిబంధనలు గండికొడుతున్నాయి. స్థూలంగా.. పోటీ పరీక్షలకు పోటీపడలేని పరిస్థితి కల్పిస్తున్నాయి. టీజీపీఎస్సీ ఇటీవలీ కాలంలో ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీచేసింది. దరఖాస్తుల లింక్ ఓపెన్కాకముందే కటాఫ్ తేదీ నిర్ణయించింది. ఈ ఒక్క చిన్న సాంకేతిక కారణం వేలాది మంది పాలిట గొడ్డలిపెట్టుగా మారుతున్నదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు.. పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచిచూస్తున్నవారు అవకాశం కోల్పోయే ప్రమాదమున్నదని వాపోతున్నారు. కటాఫ్ తేదీ విషయంలో టీజీపీఎస్సీ పునరాలోచించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం, టీజీపీఎస్సీ స్పందించి సవరించి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
కటాఫ్ తేదీతో రెండు రకాల నష్టం జరుగుతున్నది. కటాఫ్ తేదీకి ముందు సర్టిఫికెట్లు చేతిలో లేకపోతే ఉద్యోగాలకు పోటీపడలేని పరిస్థితి ఉన్నది. ఇక దరఖాస్తుల సమర్పణకు నెల, నెలన్నర సమయమిస్తున్నారు. ఈ వ్యవధిలో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యి, మెమోలు చేతికందినా పోటీపడలేని పరిస్థితులున్నాయి. ఇలాంటివారు చాలా తక్కువ వ్యవధితో ఈ పోస్టులకు పోటీపడే అవకాశాన్ని కోల్పోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండున్నరేండ్ల కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఐదారే. మళ్లీ నోటిఫికేషన్లు పడతాయా..? అంటే అనుమానమే. ఇప్పుడు త్రుటిలో అవకాశం కోల్పోయిన వారు మళ్లీ ఐదారేండ్ల వరకు నిరీక్షించాల్సిందే.
ఇది గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తీరని నష్టమని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దరఖాస్తుల గడువుకు నెలకు పైగా సమయమిచ్చినప్పుడు.. అదే తేదీ వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించకపోవడంలో అంతర్యమేమిటో అర్థంకావడంలేదని అభ్యర్థులంటున్నారు. అప్పులు చేసి అశోక్‌నగర్, చిక్కడపల్లిలో చదువుకుంటున్న తమకు అవకాశం దక్కకపోవడం కలచివేస్తున్నదని వాపోతున్నారు.
దేశంలోనే అత్యున్నత నియామక సంస్థ అయిన యూపీఎస్సీ కటాఫ్ తేదీ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. సివిల్స్ ప్రిలిమ్స్‌కు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నవారు.. ఫలితాల కోసం వేచి చూస్తున్నవారు సైతం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇచ్చింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో పాసైనా.. ఇంటర్న్‌షిప్ పూర్తి కాకపోయినా పరీక్ష రాయవచ్చు. పరీక్షలు ముగిసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ సమయానికి విద్యార్హతల సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతుంది.
దేశంలోని రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు మార్గదర్శకత్వం వహించే, ఆదర్శంగా నిలిచే యూపీఎస్సీయే ఈ విధానాన్ని పాటించినప్పుడు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే విధానాన్ని ఎందుకు అవలంబించడంలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రిక్రూట్మెంట్బోర్డులు దరఖాస్తుల గడువు ముగిసే తేదీ కటాఫ్‌గా అమలు చేస్తున్నారు. కనీసం దీనినైనా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విద్యార్థి, నిరుద్యోగ అనుకూల విధానాలు పాటించకపోవడంతో నష్టపోవాల్సి వస్తున్నదని, నిరుద్యోగ జేఏసీ నేతలు వాపోతున్నారు.
డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ఈ నెల 18న కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కటాఫ్ తేదీని ఈ నెల 18గా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 24న మొదలయ్యి.. జూలై 29తో ముగుస్తుంది. ఈ పోస్టుకు పీజీతోపాటు ఎంఈడీ విద్యార్హత గల వారు పోటీపడొచ్చు.
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జూన్ 5న నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుల గడువు ఈనెల 12 నుంచి జూలై 19 వరకు ఉంది. ఈ పోస్టులకు పోటీపడేవారికి నోటిఫికేషన్ విడుదలైన జూన్ 5వ తేదీనే కటాఫ్‌గా
నిర్ణయించారు.
ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీకాగా, దీనికి కటాఫ్ తేదీగా జూన్ 2 నిర్ణయించారు. దరఖాస్తులేమో జూన్ 8 నుంచి జూలై 15 వరకు సమర్పించవచ్చు.