హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘అసలు ముక్కనే ముట్టరా.? అదేం తిండి. ఎట్ల బతుకుతరు? బలం ఎట్లొస్తది?’ చాలామంది మాంసాహారుల ప్రశ్నలివి.. కానీ, శాకాహారంలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. వ్యాధులు రాకుండా నియంత్రిస్తాయని పేర్కొంటున్నారు. శాకాహారం తినేవారిని వీగన్ (శాకాహారి) అని అంటారు. సోమవారం ప్రపంచ శాకాహార దినోత్సవం.
శాకాహారులు ప్రతి రోజు 2000 క్యాలరీలు అందేలా ఆహారాన్ని తీసుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాకాహారంతో గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు దరిచేరవని ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మయ్య పేర్క్నొరు. మాంసాహారంతో కొన్ని ప్రయోజనాలు ఉన్నా మోతాదుకు మించి తింటే వాటితో వచ్చే ముప్పు ఎక్కువని చెప్పారు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల జీవితకాలమే ఎక్కువ చాలా పరిశోధనల్లో నిరూపితమైందని పేర్కొన్నారు.