మ్యాక్ బుక్.. చాలామంది కలల ల్యాప్‌టాప్. ఆపిల్ సంస్థ తయారుచేసే ఈ నాజూకైన ల్యాపీని సొంతం చేసుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అయితే, దాని ధర చూసి రెండడుగులు వెనక్కి వేస్తారు. అలాంటివారిని టార్గెట్ చేస్తూ.. ఆపిల్ సంస్థ బడ్జెట్లోనే మ్యాక్‌బుక్‌కు రూపకల్పన చేసింది. తాజాగా, అత్యంత చౌకైన ల్యాప్‌టాప్‌గా ‘మ్యాక్‌బుక్ నియో’ను అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా విద్యార్థులు, బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ల్యాపీని తీర్చిదిద్దింది. ఈ బడ్జెట్ మ్యాక్బుక్లోని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా మొబైల్ చిప్ అయిన ఏ18 ప్రోను ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం ఈ చిప్.. ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో వాడుతున్నారు. ఇక ఇందులో 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూ ఉన్నాయి. 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. 8 జీబీ యూనిఫైడ్ మెమరీ (ర్యామ్)తోపాటు 256జీబీ/ 512జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ల్యాపీ లభిస్తుంది. ఇది కొత్త macOS Tahoe తో పనిచేస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లనూ సపోర్ట్ చేస్తుంది. అల్యూమినియం బాడీతో చాలా తేలికగా.. కేవలం 1.22 కేజీల బరువు మాత్రమే ఉంటుంది.
ఈ ల్యాపీ ఫ్యాన్‌లెస్ డిజైన్! కాబట్టి, వాడుతున్నప్పుడు ఎలాంటి శబ్దం రాదు. ఇక ఈ చిన్న ల్యాపీలో బ్యాటరీకి పెద్దపీట వేశారు. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 16 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం రెండు యూఎస్బీ-సి పోర్ట్స్తోపాటు వైఫై 6ఈ, బ్లూటూత్ 6, హెడ్‌ఫోన్ జాక్ ఏర్పాటు చేశారు. సిల్వర్, ఇండిగో, బ్లష్, సిట్రస్ లాంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వస్తున్నది.
మనదేశంలో 256జీబీ వేరియంట్ ధర రూ.69,900, 512జీబీ వేరియంట్ ధర రూ.79,900గా ఉండనున్నది. విద్యార్థుల కోసం ప్రత్యేక తగ్గింపుతో రూ.59,900 నుండే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. సాధారణ బ్రౌజింగ్, ఆఫీస్ పనులు, చదువుల కోసం తక్కువ ధరలో మ్యాక్‌బుక్ కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.