కోల్కొట్టుడు
- ముంబైపై కోల్‌కతా ఘనవిజయం
- బుమ్రా శ్రమ వృథా
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు! గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గాడిన పడ్డట్లు కనిపించిన రోహిత్ సేన.. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. గాయం కారణంగా సూర్యకుమార్ జట్టుకు దూరం కాగా.. నిలకడగా రాణిస్తున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ విఫలమవడం ముంబైని దెబ్బ కొట్టింది. పేస్ గుర్రం బుమ్రా ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్లతో అదుర్స్ అనిపించుకున్నా.. ఆ ప్రదర్శనతో జట్టును గట్టెక్కించలేకపోయాడు! పన్నెండు మ్యాచ్‌ల్లో ఐదో విజయం నమోదు చేసుకున్న కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఏడోస్థానానికి ఎగబాకింది.
ముంబై: ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్లతో అదరగొట్టినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసి సీజన్లో ఐదో విజయం నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. శ్రేయస్ అయ్యర్ (6), రస్సెల్ (9), షెల్డన్ జాక్సన్ (5), కమిన్స్ (0) విఫలమయ్యారు. చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
వెంకటేశ్ అయ్యర్ దూకుడుకు అజింక్యా రహానే (25) సంయమనం తోడవడంతో ఒకదశలో 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసిన కోల్‌కతాను.. ముంబై బౌలర్లు అడ్డుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు. 15వ ఓవర్లో రస్సెల్, నితీశ్ రాణాలను ఔట్ చేసిన బుమ్రా.. 18వ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో జాక్సన్, కమిన్స్, నరైన్ (0) వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలో113 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ రోహిత్ శర్మ (2).. అంపైర్ ఇచ్చిన సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (6) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రమన్‌దీప్ సింగ్ (12), టిమ్ డేవిడ్ (13), పొలార్డ్ (15), సమ్స్ (1) ఆకట్టుకోలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ 3, రస్సెల్ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం లక్నోతో గుజరాత్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 20 ఓవర్లలో 165/9 (వెంకటేశ్ 43, నితీశ్ 43; బుమ్రా 5/10, కార్తికేయ 2/32), ముంబై: 17.3 ఓవర్లలో 113 ఆలౌట్ (ఇషాన్ 51; కమిన్స్ 3/22, రస్సెల్ 2/22).

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

