Crypto Currency | వర్చువల్ కరెన్సీలో కింగ్‌గా అభివర్ణించే ‘క్రిప్టోను చాలా జాగ్రత్తగా వాడాలి. మనకు ఆ చిట్కా తెలియకపోతే అసలుకే మోసం. కాబట్టి, త్వరపడి కొనకుండా.. ముందుగా అవగాహన పెంచుకోవాలి. లేకపోతే, ఆన్లైన్ మాయా వేదికపై కట్టుబట్టలతో నిలబెట్టేస్తారు సైబర్ కేటుగాళ్లు. ఇక మనదేశంలో క్రిప్టో కరెన్సీకి ఆర్బీఐ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి.. మనం మరింత జాగ్రత్తగా మసులుకోవాలి.
ఆన్లైన్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండే సూర్యను క్రిప్టో కరెన్సీ ఎప్పటి నుంచో ఊరిస్తున్నది. దాని గురించి పూర్తి అవగాహన లేకపోయినా.. క్రిప్టో విధానంలో పెట్టుబడులు పెడితే బోలెడన్ని లాభాలు ఉంటాయని తెలుసుకున్నాడు. ఖాళీ దొరికతే చాలు.. నెట్లో క్రిప్టో గురించే వెతికేవాడు. లోతుగా ఆరా తీసేవాడు. అదే సమయంలో ఆన్‌లైన్‌లోకి వచ్చారు సైబర్ దొంగలు. సూర్య కుతూహలం వారికి వరంగా మారింది. ‘అతి తక్కువ ధరకే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి.. అధిక లాభాలు పొందొచ్చు’ అంటూ అతనికి మెసేజ్‌లు పెట్టేవారు. ఒక్కోరోజు, పెట్టుబడులు ఆహ్వానించే కంపెనీల లిస్టునూ పంపేవారు. వాటి గురించి చెక్ చేసుకుంటే నిజమేనని తేలింది. అనుమానంగానే వారిని సంప్రదించాడు. కల్లబొల్లి కబుర్లు చెప్పి తమ దారిలోకి తెచ్చుకున్నారు కేటుగాళ్లు. ఆఫర్లు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు పెట్టుబడి పెడితే.. మరిన్ని లాభాలొస్తాయని ఊదరగొట్టారు. ఆ మాయలోంచి బయటికి రాని సూర్య.. తన బిజినెస్ సేవింగ్స్ నుంచి లక్షల రూపాయలు పెట్టి క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ డిజిటల్ కరెన్సీని సదరు మాయగాళ్లు పంపిన లింక్‌లో పెట్టుబడిగా పెట్టడంతో కరెన్సీ మొత్తం వారి ఖాతాల్లోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు నుంచి వాళ్ల జాడ లేకపోవడంతో.. నిలువునా మోసపోయానని తెలుసుకున్నాడు. తనతోపాటు.. తన కుటుంబాన్నీ నడిబజార్లో నిలబెట్టాడు.
వర్చువల్ కరెన్సీగా వ్యవహరించే క్రిప్టో కరెన్సీని డిజిటల్ ఆస్తిగా భావిస్తారు. దీనిద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు.. ఆకర్షణీయమైన లాభాలు వచ్చినప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్లాక్ చెయిన్ సిస్టమ్ ద్వారా నిర్వహించే ఈ క్రిప్టో కరెన్సీ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధానంలో ఉపయోగిస్తే ఎన్ని లాభాలున్నాయో.. ఏమీ తెలుసుకోకుండా అడుగుపెడితే అంతకు మించిన నష్టాలు ఉంటాయి. అందుకే ‘క్రిప్టో’తో జాగ్రత్తగా వ్యవహరించాలంటారు సైబర్ నిపుణులు. ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ ఎక్ఛ్సేంజీలను ప్రపంచ దేశాలు ఆమోదిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్, ఎథేరియం, లైట్‌కాయిన్, కార్డానో, పోల్కాడాట్, స్టెల్లార్, బినాన్స్ కాయిన్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ రూ.26.44 లక్షలు.
క్రిప్టో కరెన్సీ నిర్వహించడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వాడుతున్నా.. మోసాలు మాత్రం ఆగడం లేదు. కారణం వాటి నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడమే. దీంతో క్రిప్టో కరెన్సీలు స్కామ్‌లకు, సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. సైబర్ నేరగాళ్లు ..కాయిన్ కొనుగోలు చేయమంటూ, ప్రారంభ ఆఫర్లు బాగా ఉన్నాయంటూ ఊరిస్తుంటారు. సోషల్ మీడియా నకిలీ అకౌంట్లతో అమాయకులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి ఆ వలలో పడిపోతే.. మొత్తం దోచేస్తారు. ఒక్కోసారి క్రిప్టోను కొనుగోలు చేసిన తర్వాత.. దాని విలువను తగ్గించేస్తారు. గూగుల్, ఆపిల్ ప్లేస్టోర్ల నుంచి యాప్స్‌ను డౌన్లోడ్ చేయకుండా.. ఏపీకే ఫైల్స్ ద్వారా ఆన్లైన్లో క్రిప్టో వ్యవహారాలు నిర్వహించడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి క్రిప్టో మోసాలను పోంజీస్కీమ్లు, పంప్ అండ్ డంప్ స్కీమ్స్, ఎగ్జిట్ స్కామ్స్, ఫిషింగ్ పేర్లతో పిలుస్తారు. క్రిప్టో కరెన్సీ వల్ల లాభపడిన వారికంటే.. నష్టాలు చవిచూసినవారే ఎక్కువ. సరైన క్రిప్టో వాలెట్ల గురించి పూర్తిస్థాయిలో తెలియకపోవడమే ఇందుకు కారణం. కొందరు సరైన వాలెట్‌ను నిర్వహిస్తూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందుతున్నారు. మీరు క్రిప్టో ఖాతా తెరువాలనుకుంటే.. కేవైసీ కోసం ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైలింగ్ లైసెన్స్ వంటివి సమర్పించాలి. క్రిప్టో ట్రేడింగ్ కోసం కొంత చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అది మీరు ట్రేడింగ్ చేయాలనుకున్న క్రిప్టో కరెన్సీ విలువలో 0.05 శాతం నుంచి 0.10శాతం వరకూ ఉంటుంది.
> క్రిప్టో కరెన్సీ గురించి ఆన్లైన్లో ఊదరగొడుతుంటారు. ఆ ప్రకటనలకు మోసపోకండి. మీరు కూడా క్రిప్టో కరెన్సీని నిర్వహించాలనుకుంటే.. అప్పటికే నిర్వహిస్తున్న వారి సలహాలు తప్పక తీసుకోండి.
> రాబడులు ఎక్కువగా ఉన్నా సరే, తొలిదశలో తక్కువ మొత్తంలోనే పెట్టుబడులు పెట్టాలి. ఇదే సరైన మార్గం. ఒకవేళ నష్టాలు వచ్చినా.. తక్కువ సొమ్మే కాబట్టి ఇబ్బంది ఉండదు.
> ఒక క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినప్పుడు.. ఆ వచ్చిన లాభాలను మరో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి. అలా అవకాశాన్ని బట్టి కొత్త క్రిప్టోకు విస్తరించండి.
> కాయిన్ బేస్, బైనాన్స్, కాయిన్ డెస్క్ వంటి ప్రఖ్యాత ఎక్సేంజీల గురించి పూర్తిగా తెలుసుకోండి. వాటి విత్‌డ్రాలు కూడా చాలా ముఖ్యం కాబట్టి.. ప్రతీది జాగ్రత్తగా గమనించండి.
> క్రిప్టో కరెన్సీ ఒక్కోసారి మాయాజూదంగా మారుతుంది. హెచ్చుతగ్గులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి సిద్ధపడిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి.
> క్రిప్టో కరెన్సీ నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్న విషయం. కాబట్టి, అన్నిటికీ సిద్ధపడి ఉండటం మంచిది. ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా పరిశీలించి, లోతుగా పరిశోధించిన తర్వాతే ముందడుగు వేయండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?