‘మహిళలు స్వతహాగా బలహీనులు, భయపడిపోతారు.. తరహా అభిప్రాయాలు ఇంకా ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ లక్ష్మణ రేఖలను చెరిపేసి, అణగారిన వర్గాల స్వరాన్ని గట్టిగా వినిపించటం నా ధ్యేయం’ అంటున్నారు కవితాదేవి. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఖబర్ లహరియా’ పత్రికకు ఆమె సంపాదకురాలు, సహ-వ్యవస్థాపకురాలు. ఉత్తరప్రదేశ్లోని కుంజన్ పూర్వా అనే పల్లెలో పుట్టారు కవిత. బాల్యంలోనే వివాహమైంది. ఇంటిపెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా వయోజన విద్య తరగతులకు హాజరయ్యారు.
శిక్షణలో భాగంగా ‘మహిళా డాకియా’ పేరుతో రెండు పేజీల సంచిక తెచ్చారు. స్థానిక మహిళలతో బుందేలీ భాషలో వ్యాసాలు రాయించారు. ఆ అనుభవంతో ‘ఖబర్ లహరియా’ పత్రికను ప్రారంభించారు. దళిత కుటుంబంలోనే పుట్టిన మీరా అనే పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కవితతో చేతులు కలిపారు. హిందీతోపాటు బుందేలి, అవధి, బజ్జిక తదితర మాండలికాల్లో ఈ పత్రికను తెస్తున్నారు. రెండు పేజీలతో ప్రారంభమైన పత్రిక ప్రస్తుతం ఎనిమిది పేజీలకు విస్తరించింది. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లోనూ అపార ఆదరణ లభిస్తున్నది. ఈ బృందంలో యాభైమంది వరకూ ఉన్నారు. అందరూ మహిళలే.